తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 లోగా ఆయన చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుంచి 1994, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబునాయుడు ఆయన్ని పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికీ రావులకు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది.