టాలీవుడ్ లో దసరా పండక్కి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతున్నాం. హాలిడేస్​ని క్యాష్ చేసుకోడానికి వివిధ భాషలకు చెందిన ఐదు క్రేజీ చిత్రాలు ఈసారి బరిలో దిగుతున్నాయి. 'భగవంత్ కేసరి' 'టైగర్ నాగేశ్వర రావు' వంటి రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో పాటుగా 'లియో' (తమిళ్), గణపత్ (హిందీ), ఘోస్ట్ (కన్నడ) వంటి డబ్బింగ్ చిత్రాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. అందుకే ఈ ఫెస్టివల్ సీజన్ కోసం సినీ అభిమానులతో పాటుగా సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాల సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటి సెన్సార్ సర్టిఫికేట్స్, రన్‌టైమ్ వివరాలు ఇప్పుడు చూద్దాం!


'భగవంత్ కేసరి':
నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి'. తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'యూ/ఎ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మించారు. 


'టైగర్ నాగేశ్వరరావు':
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న బయోగ్రాఫికల్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ నాగేశ్వర రావు'. ఇది ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'దొంగాట' ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సెన్సార్ సభ్యులు 'యూ/ఎ' (U/A) సెర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా 3 గంటలు 01 నిమిషాలు వచ్చింది. ఈ ఏడాదిలో ఎక్కువ రన్ టైమ్ కలిగిన మూవీ ఇదేనని చెప్పాలి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్, మయాంక్ సింఘానియా ఈ చిత్రాన్ని నిర్మించారు.


'లియో':
కోలీవుడ్ హీరో విజయ్, డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘లియో’. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌ 19న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సెన్సార్ బోర్డు 'యు/ఎ' (U/A) సెర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి దాదాపు 2 గంటల 44 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.


'ఘోస్ట్': 
కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఘోస్ట్'. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా 2 గంటల 07 నిమిషాల నిడివితో సెన్సార్ అయినట్లు సమాచారం. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


గణపత్:
బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌, కృతి స‌న‌న్ జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'గణపత్'. 'ఎ హీరో ఈజ్ బోర్న్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. మొదటి భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ అక్టోబర్ 20న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా నిడిబి 2 గంటల 10 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. వికాశ్ బల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జాకీ భగ్నాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 


ఇలా ఐదు యాక్షన్ మూవీస్ ఈ విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో కావాల్సినంత సందడి చేస్తున్నాయి. ఎన్ని సినిమాలొచ్చినా టాలీవుడ్ లో మాత్రం తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో, ఏవేవి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయో వేచి చూడాలి.


Also Read: దెయ్యాల సినిమాలతో నా మైండ్ అంతా పిచ్చిపిచ్చిగా మారిపోయింది'.. 'కాంచన' ఫ్రాంచైజీపై లారెన్స్‌ ఫన్నీ కామెంట్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial