GDP Data for 2nd Quarter Of 2023-24: భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి (India's Gross Domestic Production - GDP) అంచనాలకు మించి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 రెండో త్రైమాసికంలో (Q2 FY24 లేదా జులై - సెప్టెంబర్ మధ్య కాలం) దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం చొప్పున వృద్ధి చెందింది. రెండో త్రైమాసికంలో జీడీపీ గ్రోత్ రేటు 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ (RBI) గతంలో అంచనా వేసింది. ఈ అంచనాల కంటే చాలా ఎక్కువగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి (Indian economy Growth Rate) చెందింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 FY24 లేదా ఏప్రిల్ - జూన్ మధ్య కాలం) జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2022-23 రెండో త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా నమోదైంది.
రూ.41.74 లక్షల కోట్ల జీడీపీ (Rs.41.74 lakh crore GDP)
రెండో త్రైమాసికానికి సంబంధించిన GDP గణాంకాలను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో భారతదేశ మొత్తం స్థూల జాతీయోత్పత్తి (India's GDP in 2023 September Quarter) రూ. 41.74 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 38.17 లక్షల కోట్లుగా ఉంది.
రంగాల వారీ పరిస్థితి
FY24 సెకండ్ క్వార్టర్‌లో తయారీ రంగం వృద్ధి రేటు 13.9 శాతంగా లెక్క తేలింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది -3.8 శాతంగా ఉందని NSO (National Statistical Office) విడుదల చేసిన డేటాను బట్టి తెలుస్తోంది.
వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2023-24 రెండో త్రైమాసికంలో 1.2 శాతం కాగా, 2022-23 రెండో త్రైమాసికంలో 2.5 శాతంగా ఉంది.
గత ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో నిర్మాణ రంగం వృద్ధి రేటు 5.7 శాతంగా ఉండగా, ఈసారి 13.3 శాతానికి పెరిగింది.
వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం & ప్రసారాలకు సంబంధించిన సేవల వృద్ధి రేటు 4.3 శాతంగా వచ్చింది, 2022-23 రెండవ త్రైమాసికంలో ఇది 15.6 శాతంగా ఉంది.
ఆర్థికం, స్థిరాస్తి, వృత్తిపరమైన సేవల వృద్ధి రేటు 6 శాతంగా ఉంది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా నమోదైంది.
విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.1 శాతంగా ఉంది, గత ఏడాది ఇదే కాలంలోని 6 శాతం నుంచి ఇవి మెరుగపడ్డాయి.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో 8 కీలక రంగాల మొత్తం ఉత్పత్తి (Production of 8 Core Sectors in India) 12.1 శాతం పెరిగింది, గత ఏడాది ఇదే సమయంలో ఈ వృద్ధి కేవలం 0.7 శాతంగా ఉంది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి చేసిన ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలను కోర్ సెక్టార్లుగా పేర్కొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కోర్ సెక్టార్లు 9.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
2023 సెప్టెంబర్ క్వార్టర్‌లో చైనా ఆర్థిక వృద్ది రేటు 4.9 శాతంగా ఉంది. అంతకుమించిన గ్రోత్ రేట్‌తో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.
మరో ఆసక్తికర కథనం: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్ మరింత భారం