Airtel net work:  రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అస్తవ్యస్తంగా మారిపోయాయి. బాధితులకు కనీసం తినడానికి  తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ కొన్ని మినహాయింపులను ప్రకటించింది. వినియోగదారులకు అదనపు వ్యాలిడిటీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనంగా నాలుగు రోజుల వాలిడిటీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1.5 జీబీ మొబైల్ డేటాను 4 రోజుల పాటు అందించనున్నట్లు తెలిపింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల బిల్లుల చెల్లింపు గడువును వారం రోజుల పాటు పొడిగించింది. ఇంట్లో వై-ఫై కనెక్షన్ ఉన్నవారికి 4 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించినట్లు ప్రకటించింది.


ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే..
వరద ప్రభావం వల్ల ప్రజలకు ఎయిర్ టెల్ సైతం తన వంతుగా సహాయం అందించడానికి ముందుకొచ్చింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ మినహాయింపులు ఇచ్చినట్లు ఎయిర్ టెల్ వెల్లడించింది.  ప్రస్తుత విపత్తు సమయంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ప్లాన్‌ల గడువు ముగిసిన లేదా రీఛార్జ్ చేసుకోలేని ప్రీపెయిడ్ కస్టమర్‌లు ఈ బంపర్ ఆఫర్‌ను అందుకుంటారు. ఈ మేరకు మంగళవారం (సెప్టెంబర్ 3) ఎయిర్ టెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.


మొబైల్ సేవలకు అంతరాయం కలుగకుండా..
పోస్ట్ పెయిడ్ కస్టమర్ల విషయానికొస్తే.. మొబైల్ సేవలకు అంతరాయం కలగకుండా చెల్లింపు గడువు తేదీలను వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీపెయిడ్ హోమ్‌లకు సంబంధించి చెల్లుబాటు వ్యవధి గడువు ముగిసిన లేదా రీఛార్జ్ చేయలేని కస్టమర్‌లు మరో  రోజుల అదనపు చెల్లుబాటును పొందుతారని కూడా పేర్కొంది. ఇది  వైఫై సేవలకు అంతరాయం లేని యాక్సెస్‌ను అందిస్తామని పేర్కొంది.



వణికి పోయిన తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాల నేపథ్యంలో చిగురుటాకుల్లో వణికిపోయాయి. ప్రధానంగా తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడ వర్షాలకు కుదేలయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  అధికారులు సహాయకార్యక్రమాలు ముమ్మరం చేయాలని కూడా సూచించారు. కుండపోతగా కురిసిన వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా... ఇప్పటికి కూడా పలు ప్రాంతాల్లో వరద ప్రభావం ఏమాత్రం కూడా తగ్గుముఖం పట్టలేదు.   ఇలాంటి క్లిష్ట సమయంలో తమ వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు సహాయం చేయడానికి.. ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, ఇంధన సరఫరాల విషయంలో అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా.. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, అవసరమైన చోట పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ బృందాలు శ్రమిస్తున్నాయని కంపెనీ తెలిపింది. 


Also Read: Pawan Mahesh Donation: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం