Pawan Kalyan Donates Rs 1 Crore For Flood Relief | అమరావతి: ఏపీలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. కేంద్రం నుంచి హెలికాప్టర్లు, పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రప్పించి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తోంది. సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు వరద పరిస్థితిని చూసి చలించిపోయి బాధితులకు అండగా నిలిచేందకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాయం చేయడానికి ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు రూ.1 కోటి భారీ సాయం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున మహేష్ సాయం చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్, బాలకృష్ణ సైతం వరద బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల భారీ సాయాన్ని అందిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం ప్రకటిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.






పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. వారిని ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 కోటి రూపాయల విరాళం ఇస్తున్నానని బుధవారం తెలిపారు. సీఎం చంద్రబాబును బుధవారం నేరుగా కలిసి చెక్కును అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో విజయవాడ, గుంటూరులో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించారు. ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో వరద ముప్పు
ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఈ విపత్తు రావడం దురదృష్టకరం. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరును నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు. బుడమేరుకు సంబంధించిన నిర్వహణ పనులను అప్పటి ప్రభుత్వం చేయలేదు. విపత్తు సంభవించగానే కూటమి ప్రభుత్వం సత్వరమే స్పందించి ఎఫెక్టివ్ గా పని చేసింది. వరద బాధితుల కోసం 262 ప్రత్యేక టీమ్ లు, 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం.  సహాయం కోసం ప్రజలు 112, 1070, 18004250101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. తాజా వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు’ పవన్ కళ్యాణ్. 


Also Read: YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?