GST Collection Feb 2022: ఫిబ్రవరి నెలలో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 18 శాతం అధికంగా రూ.1.33 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్‌టీ చరిత్రలో ఇది ఐదోసారి.


2022, ఫిబ్రవరి నెలలో జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1,33,206 కోట్ల రాబడి వచ్చింది. అందులో సీజీఎస్‌టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ ద్వారా రూ.67,471 కోట్లు వచ్చాయి. దిగుమతుల ద్వారా రూ.33,837 కోట్లు వచ్చింది. సెస్‌ రూపంలో రూ.10,340 కోట్లు వచ్చాయి. 2021, ఫిబ్రవరితో పోలిస్తే జీఎస్‌టీ రాబడి ఈ సారి 18 శాతం పెరగ్గా 2020తో పోలిస్తే ఏకంగా 26 శాతం పెరగడం గమనార్హం.


గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దిగుమతుల ద్వారా అధికంగా 38 శాతం, దేశవాళీ లావాదేవీల ద్వారా 12 శాతం అధికంగా ఆదాయం లభించింది. 'సాధారణంగా ఫిబ్రవరిలో 28 రోజులే ఉండటంతో జనవరి కన్నా తక్కువ జీఎస్‌టీ రాబడి ఉంటుంది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ఉన్నప్పటికీ లాక్‌డౌన్లు, ఆంక్షలు, నైట్‌కర్ఫ్యూలు తక్కువగా ఉండటంతో 2022, ఫిబ్రవరిలో ఎక్కువ వృద్ధి కనిపించింది' అని ఫైనాన్స్‌ మినిస్ట్రీ తెలిపింది. 


జీఎస్‌టీ కలెక్షన్లు రూ.1.30 లక్షల కోట్లు దాటడం ఇది ఐదో సారి. జీఎస్‌టీ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత తొలిసారి జీఎస్‌టీ సెస్ కలెక్షన్‌ రూ.10,000 కోట్ల మైలురాయిని దాటింది. ఆటో మొబైల్‌ విక్రయాలు సహా కొన్ని కీలక రంగాలు పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. ఫిబ్రవరి కలెక్షన్లను సెటిల్‌ చేసిన తర్వాత కేంద్రానికి రూ.50,782 కోట్లు, రాష్ట్రాలకు రూ.52,688 కోట్లు వచ్చాయి.


Also Read: భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్ రాజీనామా - లేఖలో సంచలన ఆరోపణలు


Also Read: సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత- 'విడలేక నిన్ను వీడిపోయాను నాన్న'