LPG cylinder price reduced today: LPG సిలిండర్ వినియోగదార్లకు గుడ్‌ న్యూస్‌. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరను తగ్గించాయి. రేట్‌ కటింగ్‌ తర్వాత, ఇప్పుడు, 19 కిలోల LPG సిలిండర్ల వినియోగదార్లకు ఒక్కో సిలిండర్‌ మీద దాదాపు 40 చొప్పున మిగులుతాయి. 


ఈ రోజు నుంచి కొత్త ధరలు అమలు
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల LPG సిలిండర్ ధరను (Commercial LPG Cylinder Price Today) రూ. 39.50 తగ్గించాయి. వాణిజ్య సిలిండర్లపై కొత్త ధరలు ఈ రోజు నుంచి, అంటే 2023 డిసెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ప్రకటన ప్రకారం, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుంచి 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మరింత తక్కువ ధరకే దొరుకుతుంది.


నాలుగు మెట్రోల్లో కొత్త ధరలు
ధరలో మార్పు తర్వాత, దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితిని గమనిస్తే... దేశ ఆర్థిక రాజధాని ముంబైలో LPG సిలిండర్ చవగ్గా అందుబాటులో ఉంది, చెన్నై ప్రజలు అత్యధిక ధర చెల్లించవలసి ఉంటుంది. నాలుగు మెట్రో నగరాల్లో... ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ ధర ఈ రోజు నుంచి రూ.1,710 కి తగ్గింది. చెన్నైలో రేటు రూ. 1,929 కి దిగి వచ్చింది. దేశ రాజకీయ రాజధాని దిల్లీలో రూ. 1,757 గా, కోల్‌కతాలో రూ. 1,868.50 కి చేరింది.


3 నెలల్లోనే ధర భారీగా పెరిగింది
తాజా తగ్గింపు కంటే ముందు, వాణిజ్య LPG సిలిండర్ల ధరలు నెలనెలా పెరుగుతూనే వచ్చాయి. గత 3 నెలల్లో వీటి ధరలు మూడు సార్లు పెరగగా, మొత్తం రూ. 320 కి పైగా పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీన (డిసెంబర్‌ 1, 2023) 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ రేటును రూ. 21 చొప్పున పెంచారు. అంతకు ముందు, నవంబర్‌లో రూ. 101, అక్టోబర్‌లో రూ. 209 పెంచారు.


మరో ఆసక్తికర కథనం: 10 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయకపోతే మీ జేబుకు చిల్లు తప్పదు!


సామాన్యుడికి ఈసారి కూడా ఉపశమనం దక్కలేదు
ఇళ్లలో వాడే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర (Domestic LPG Cylinder Price Today) మారలేదు. రేట్లు తగ్గుతాయేమోనని కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న సాధారణ ప్రజలకు ఊరట దక్కడం లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50, చెన్నైలో రూ. 918.50, హైదరాబాద్‌లో రూ. 955, విజయవాడలో రూ. 944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.


LPG సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: పడి, పైకి లేచిన మార్కెట్లు - 71k పైన సెన్సెక్స్‌, 21,300 దాటిన నిఫ్టీ