Food Consumption Expenditure Survey 2022-23: మన దేశంలో, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నమైన వాతావరణం, సంప్రదాయాలు, ఆచార & వ్యవహారాలు కనిపిస్తాయి. వీటి కారణంగా భారతదేశ ప్రజల ఆహార అలవాట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఒకే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూడా విభిన్నంగా ఉంటాయి.
2022-23 సంవత్సరానికి విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే ప్రకారం... భారత గ్రామీణ & పట్టణ ప్రాంతాల ప్రజలు పానీయాలు, రిఫ్రెష్‌మెంట్లు, ప్రాసెస్ చేసిన ఆహారం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ప్రజలు ప్యాక్ చేసిన ఆహారంతో పాటు పాలు & పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, చేపలు కొనడం కోసం జేబు నుంచి ఎక్కువ కరెన్సీ నోట్లు తీస్తున్నారు.
పాలు & పాల ఉత్పత్తుల కోసం అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్రం ఇదే
హరియాణా రాష్ట్రంలో, గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు పాలు & పాల ఉత్పత్తులపై ఎక్కువ వ్యయం చేశారు. ఇది వారి మొత్తం ఆహార ఖర్చుల్లో 41.70 శాతం. దక్షిణాది రాష్ట్రం కేరళలో, ప్రజలు మాంసం, చేపలు, గుడ్లు వంటి మాంసాహారాన్ని ప్రజలు బాగానే లాగిస్తున్నారు. వాటి కోసం చేసిన వ్యయం మొత్తం ఆహార ఖర్చులో 23.5 శాతం.
రాజస్థాన్ విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల ప్రజలు పాలు & పాల ఉత్పత్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు. ఇది వారి మొత్తం ఆహార ఖర్చుల్లో 33.2 శాతం. హరియాణా పట్టణ ప్రాంతాల్లో, మొత్తం ఆహార వ్యయంలో 33.1 శాతం పాలు & పాల ఉత్పత్తుల కోసం కేటాయిస్తుంటే, పంజాబ్‌లో అవే పదార్థాల కోసం 32.3 శాతం ఖర్చు చేశారు.
రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ప్రాసెస్ చేసిన ఆహారం కంటే పాలు & పాల ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారు, వాటి కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. రాజస్థాన్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పాలు & పాల ఉత్పత్తుల కోసం మొత్తం ఆహార వ్యయంలో 35.5 శాతం, పంజాబ్‌లో 34.7 శాతం, గుజరాత్‌లో 25.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 22.6 శాతం, మధ్యప్రదేశ్‌లో 21.50 శాతం ఖర్చు చేశారు.
ప్రాసెస్ చేసిన ఆహారం కోసం ఎక్కువ డబ్బు వెచ్చిస్తున్న ప్రజలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 33.70 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 28.40 శాతం మంది ప్రాసెస్డ్ ఫుడ్ కోసం వ్యయం చేస్తున్నారు.
గ్రామీణ & పట్టణ భారతదేశంలో ఆహారం ఖర్చులు ఇవీ...
గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారం... దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో, ఒక కుటుంబం తన మొత్తం ఆదాయంలో సగటున 46 శాతాన్ని ఆహారం కోసం ఖర్చు చేస్తోంది. ఇందులో... ప్రాసెస్ చేసిన పానీయాలు, రిఫ్రెష్‌మెంట్‌ల కోసం గరిష్టంగా 9.62 శాతం ఖర్చు చేశారు. పాలు & పాల ఉత్పత్తుల కోసం 8.33 శాతం, ధాన్యాలు & ధాన్యపు ఉత్పత్తుల కోసం 4.91 శాతం వాటా కేటాయించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో... పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు మొత్తం 'నెలవారీ తలసరి వినియోగ వ్యయం'లో (MPCE) ఆహారం కోసం సగటున 39 శాతం ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ కోసం ఎక్కువ డబ్బు తీస్తున్నారు. పట్టణ ప్రజల మొత్తం వ్యయంలో 10.64 శాతం పాలు & పాల ఉత్పత్తులపై ఖర్చు అవుతుండగా, 7.22 శాతం కూరగాయలు, పండ్ల కోసం వెచ్చిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఆన్‌లైన్ షాపింగ్ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ - మీ డబ్బు తిరిగొస్తుంది!