PM Modi Oath Ceremony: జూన్ 9వ తేదీన మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే విదేశాధినేతలకు ఆహ్వానం పంపారు. అయితే...ఈ 8 వేల మంది అతిథుల జాబితాలో ఓ పేరు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వందేభారత్ రైళ్లని నడిపే మహిళా లోకోపైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్‌కి (Aiswarya S Menon) ప్రభుత్వం తరపున ఆహ్వానం అందడం ఆసక్తి కలిగిస్తోంది. ఎవరీమె..? ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం ఎందుకు అందింది..? ఆమె ఎందుకంత స్పెషల్ అంటే...ఇప్పటి వరకూ తన కెరీర్‌లో 2 లక్షల గంటల పాటు ట్రైన్ నడిపి రికార్డు సృష్టించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్, జన్ శతాబ్ది సహా మరి కొన్ని రైళ్లకు లోకోపైలట్‌గా వ్యవహరించారు. దక్షిణ రైల్వేలో చెన్నై డివిజన్‌లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పని చేస్తున్నారు ఐశ్వర్య ఎస్ మీనన్. చెన్నై విజయవాడ, చెన్నై కోయంబత్తూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ నడిపారు. వీటిని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆమే లోకోపైలట్‌గా వ్వహరిస్తున్నారు. విధుల పట్ల ఎంతో నిబద్ధతగా ఉండే ఆమెపై సీనియర్ అధికారులు తరచూ ప్రశంసలు కురిపించే వాళ్లు. అందుకే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమెకి ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా పేరు తెచ్చుకున్న సురేఖా యాదవ్‌కి (Surekha Yadav) కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది. లోకోపైలట్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 1988లో ఈ బాధ్యతలు తీసుకున్నారు. సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌నీ నడిపిన తొలి మహిళగా నిలిచారు. వీరిద్దరితో పాటు మొత్తం 10 మంది లోకోపైలట్స్‌ని ప్రభుత్వం ఆహ్వానించింది. పారిశుద్ధ్య కార్మికులు, కూలీలతో పాటు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో పని చేసిన వారికి ఆహ్వానం అందింది. వేలాది మంది అతిథులకు తగ్గట్టుగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.