Graduate MLC By Election Results: వరంగల్​ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ (Graduate MLC)గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. మూడు రోజుల పాటు జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ (By Election Counting) శుక్రవారం రాత్రి ముగిసింది. ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి (Premender Reddy) ఎలిమినేషన్ అనంతరం తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి(Rakesh Reddy)పై 14 వేల ఓట్ల ముందంజలో ఉండడంతో ఆయన గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 


రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం
నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్​ జరిగింది. మొత్తం 50 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్‌ తరువాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న,  బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య హోరా హోరీ పోటీ జరిగింది.  చివరకు 14 వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉండటంతో మల్లన్న విజయం అందుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు. 


తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజేత ఎవరో తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. ఆ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్నకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు పడ్డాయి. ఉపఎన్నికలో మొత్తం 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. అయితే వాటిలో భారీగా చెల్లని ఓట్లు బయటపడ్డాయి. కౌంటింగ్ పూర్తయ్యే సరికి చెల్లని ఓట్లు భారీగా నమోదయ్యాయి. చదువుకున్న యువత భారీ సంఖ్యలో చెల్లని ఓట్లు వేయడం ఆలోచించాల్సిన విషయం.   


రాకేష్ రెడ్డికి ‘రెండో ప్రాధాన్యం’ దెబ్బ
స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజీపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిలకు 73,110 తొలి ప్రాధాన్యతా ఓట్లు పడగా వీటిలో సుమారు 20 వేల బ్యాలెట్‌ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓట్లు వేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేశ్‌రెడ్డి చివరకు ఆ ఓట్లు కోల్పోయి ఓటమిని అంగీకరించారు. ఓడినా ప్రజల మధ్యనే ఉంటానని తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు, ఓటేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పట్టభద్రులందరికీ రాకేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గెలుపుతో కాంగ్రెస్‌ శ్రేణులు, ఆయన అనుచరులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.