BFSI Elective Course: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఐచ్ఛిక కోర్సు(Elective Course)గా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(BFSI)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రవేశపెడుతున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇప్పటికే బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియంతో ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ, స్టేట్ స్ట్రీట్, లండన్ స్టాక్ సంస్థల ప్రతినిధులు డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా ఎలెక్టివ్ కోర్సుకు సంబంధించిన సిలబస్‌ను సైతం ఆ కంపెనీల ప్రతినిధులే రూపొందించనున్నారు. శిక్షణతోపాటు ఇంటర్న్‌షిప్, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పించనున్నారు. 


ఈ ఏడాది 5 వేల మందికే అవకాశం..
బీటెక్ తరహాలో డిగ్రీలో ఐచ్ఛిక కోర్సుగా తీసుకొచ్చిన ఈ కోర్సులో.. ఈ ఏడాదికి 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది నాన్ ఇంజినీరింగ్(డిగ్రీ) విద్యార్థులకు ఈ అవకాశం దక్కనుంది. 2025-26 విద్యాసంవత్సరం నాటికి ఈ సంఖ్య లక్షకు పెరగనుంది. వారందరికీ బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థికపరమైన సంస్థల్లో ఉద్యోగాలు సులభంగా దక్కే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసి ఉద్యోగాలు చేస్తున్నవారికి గతేడాది ఓయూలో సాయంత్రం బీటెక్ కోర్సు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 2024-25 విద్యాసంవత్సరం నుంచి జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లోనూ ప్రారంభించుకోవడానికి ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది.


భారీగా ఉద్యోగావకాశాలు..  
ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఈ రంగాల వైపునకు మళ్లుతున్నారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. గత విద్యాసంవత్సరం ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైనర్ కోర్సుగా బీఎఫ్‌ఎస్‌ఐ ప్రవేశపెట్టినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సును 34 డిగ్రీ కళాశాలలు, 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు ఆయా కళాశాలలకు ఇప్పటికే లేఖలు రాసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. 


దోస్త్ మొదటి విడతలో 76,290 మందికి సీట్ల కేటాయింపు..
దోస్త్' ప్రవేశాలకు సంబంధించి 'ఫేజ్‌-1' సీట్ల కేటాయింపు ఫలితాలను జూన్ 6న వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకోగా.. 76,290కి సీట్లు దక్కాయి. ఇందులో 28,423 మంది అబ్బాయిలు ఉండగా.. 47,867 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇక గ్రూపులవారీగా సీట్ల కేటాయింపు ఫలితాలను పరిశీలిస్తే.. ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766 మందికి; కామ‌ర్స్ గ్రూపుల్లో 28,655 మందికి; లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 15,301 మందికి; ఫిజిక‌ల్ సైన్సెస్ గ్రూపుల్లో 14,964 మందికి; డేటా సైన్స్ గ్రూపుల్లో 2,502; డీ-ఫార్మసీ గ్రూపుల్లో 90 మందికి, ఇత‌ర గ్రూపుల్లో 7012 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. భాషలవారీగా విద్యార్థుల ప్రాధ్యాన్యత పరంగా ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో 72,431 మంది, తెలుగు మీడియం కోర్సుల్లో 3,314 మంది, ఉర్దూమీడియం కోర్సుల్లో 540 మంది, హిందీ మీడియం కోర్సుల్లో 5 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 నుంచి 12 మధ్య ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 


దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో మొత్తం 1066 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 4.49 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 


దోస్త్ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..