Cine Celebs Express Condolences: సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించుకున్న మహనీయుడు రామోజీరావు మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.






తెలుగు పత్రికా రంగంలో మకుటంలేని మహారాజుగా రామోజీరావు వెలుగొందారని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని వెల్లడించారు. చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారని చెప్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోందని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.


రామోజీ రావు నిజమైన దార్శనికుడని సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ అభిప్రాయపడ్డారు. భారతీయ మీడియా రంగంలో ఆయన చేసిన విప్లవాత్మక కృషి మరువలేనిదన్నారు. జర్నలిజం, సినిమా రంగానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు.






బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు అంటూ పవన్ కల్యాణ్ కొనియాడారు. అక్షరానికి బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి అన్నారు. భారతీయ పత్రికా రంగంలోనే ఆయన కొత్త చరిత్రను లిఖించారని వెల్లడించారు. సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకుడిగా, వ్యాపారవేత్తగా ఎన్నో ఘనతలు సాధించిన రామోజీ రావు కన్నుమూయడం బాధాకరమన్నారు.






రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరుంటారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ‘నిన్ను చూడాలని’ చిత్రంతోతనను  తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేనన్నారు. రామోజీ రావు  భారతీయ మీడియా. చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయని కల్యాణ్ రామ్ వెల్లడించారు.










రామోజీ రావు మృతి పట్ల నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ టీమ్... రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. ఈ మేరకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


రామోజీరావు  మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు.  సినిమా పరిశ్రమకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచారని చెప్పారు. జర్నలిజంతో పాటు వినోదరంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు. ఆయన వారసత్వం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు.  






ఏ రంగంలో అయినా, ఎలాంటి నేప‌థ్యం లేక‌పోయినా క‌ష్ట‌ప‌డితే విజ‌యం ద‌క్కుతుందనే దానికి నిజమైన నిదర్శనం రామోజీ రావు అని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ అన్నారు.  తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన రామోజీరావు మ‌ర‌ణం ఈ దేశానికి తీర‌ని లోటు అన్నారు.


రామోజీ రావుకు సినీ ప్రముఖుల నివాళి..






















Read Also: రామోజీ రావు కలల నిర్మాణం రామోజీ ఫిల్మ్ సిటీ - ఈ ఫాంటసీ ప్రపంచంలో ఎన్నో వింతలు!