Chiranjeevi & Pawankalyan Condolences On Ramoji Rao Death : మీడియా మొఘల్ గా పేరు గాంచిన, ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 4.50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. దీంతో అటు మీడియా, ఇటు సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాజకీయ రంగంలోని ఎంతోమంది ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. మీడియా, సినీ, రాజకీయ రంగంలోనూ ఎంతో సేవ చేశారు రామోజీరావు. మెగాస్టార్ చిరంజీవి, రామోజీ రావుకి ప్రత్యేక అనుబంధం ఉంది. రామోజీరావు మృతిని తట్టుకోలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ (X) వేదికగా ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు.
ఎవరికీ తలవంచని పర్వతం..
రామోజీ రావు అస్తమయంపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. దివి కేగింది" అంటూ ఆయన ట్వీట్ చేశారు. రామోజీరావు ఫొటోను షేర్ చేశారు. చిరంజీవికి, రామోజీరావుకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈటీవీ 25 ఏళ్ల వేడుకలకు చిరంజీవి హాజరై రామోజిరావు గురించి కొనియాడారు. చిరంజీవితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది రామోజీరావు మృతికి సంతాపం తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావు అంటూ ఆయేన ట్వీట్ చేశారు. ఆయనతో పాటు కల్యాణ్ రామ్, మెహర్ రమేశ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ నివాళులు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రామోజీ రావు మరణంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేరితే.. కోలుకుని తిరిగి వస్తారని భావించానని, ఆయన ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది అంటూ పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామోజీరావు గారు.. అక్షర సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అక్షర యోధుడు అంటూ ఆయన్ను కొనియాడారు పవన్ కల్యాణ్. రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలోనే పెను సంచలనం అని అన్నారు పవన్ కల్యాణ్. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారని, నిజాలను నిక్కచ్చిగా వెల్లడిస్తూ జన చైతన్యం కలిగించారని అన్నారు.
నిష్కర్షగా వార్తలను అందించడమే కాకుండా.. ఉషోదయానికి ముందే వార్తలను ప్రజలకు చేర్చేవారని, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆయన దక్షతను తెలియజేస్తుందని అన్నారు జనసేనాని. ప్రతికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా, బహుముఖండా విజయాలు సాధించారని, రామోజీ ఫిలిమ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారని అన్నారు. అక్షర యోధుడు రామోజీ రావు మరణం ప్రతి తెలుగు వాడిని కలవరపరుస్తుందని అన్నారు. రామోజీ రావు గారి కుటుంబానికి జనసేన పక్షాన సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు పవన్ కల్యాణ్.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
ఇక రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.