FMCG Goods Price Hike: మన దేశంలో ధరల మంటలు చల్లారడం లేదు, సామాన్యుడికి ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించడం లేదు. చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) లెక్కలు చూస్తే తగ్గుతున్నట్లు కనిపిస్తుందిగానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు. ఇప్పటికే పెరిగిన కూరగాయలు, పప్పుల ధరలు ప్రజలను అగచాట్లు పెడుతున్నాయి. ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా సామాన్యుడికి ధరల షాక్ ఇచ్చాయి. గత 2-3 నెలల్లో, FMCG కంపెనీలు తమ ఆహారం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలను 2 నుంచి 17 శాతం వరకు పెంచాయి.


సామాన్యుడి నెత్తిన ధరాఘాతం
మన దేశంలో వ్యాపారం చేస్తున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ సబ్బులు, బాడీ వాష్‌ల ధరలను 2 నుంచి 9 శాతం పెంచాయి. తలకు పెట్టుకునే నూనెల (హెయిర్ ఆయిల్) రేట్లను 8 నుంచి 11 శాతం పైకి సవరించాయి. కొన్ని ఆహార పదార్థాలు 3 నుంచి 17 శాతం వరకు ఖరీదయ్యాయి. ముడి పదార్థాల ఖర్చులు (Input Costs) పెరిగాయన్న కారణంతో 2022, 2023 ప్రారంభంలో కూడా చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయి. ఎన్నికల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో రేట్లు పెంచలేదు. ఎలక్షన్స్‌ ముగిశాయి కాబట్టి ఇప్పుడు ధరాఘాతాన్ని రుచి చూపిస్తున్నాయి.


ముడి చమురు, పామాయిల్ ధరలు తగ్గినప్పటికీ.. పాలు, చక్కెర, కాఫీ, ఎండు కొబ్బరి, బార్లీ వంటి ఇతర ఆహార పదార్థాల ధరలు హై జంప్‌ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25), చిరు తిండ్ల కంపెనీ బికాజీ ‍‌(Bikaji) తన ఉత్పత్తుల ధరలను 2 నుంచి 4 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి దీని కోసం సన్నాహాలు ప్రారంభించింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ‍‌(Tata Consumer Food Products) కూడా రేట్ల సవరణ పనిని మొదలు పెట్టింది. డాబర్ ఇండియా (Dabur), ఇమామీ (Imami) వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా ఈ సంవత్సరంలో సింగిల్ డిజిట్‌ ప్రైస్‌ హైక్‌ను (1-9 శాతం) పరిశీలిస్తున్నాయి.


గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ‍‌(Godrej Consumer Products), తన ఉత్పత్తుల్లో కొన్ని సబ్బుల ధరలను 4 నుంచి 5 శాతం వరకు పెంచింది. హిందుస్థాన్ యూనిలీవర్ ‍‌(Hindustan Unilever - HUL), తన పాపులర్‌ సోప్‌ బ్రాండ్‌ డోవ్ సబ్బు రేట్లను ‍‌2 శాతం వరకు పెంచింది. విప్రో (Wipro) సంతూర్ ధరను 3 శాతం పెంచింది. పామోలివ్ బాడీ వాష్ ధరలను కోల్గేట్ (Colgate) పెంచగా, పియర్స్ ‍‌(Pears) కూడా బాడీ వాష్ ధరలను 4 శాతం పెంచింది.


హిందుస్థాన్ యూనిలీవర్‌, ప్రాక్టర్ & గాంబుల్ (Procter & Gamble - P&G) హైజీన్ & హెల్త్‌కేర్ ఉత్పత్తులతో పాటు, జ్యోతి లాబ్స్ (Jyothy Laboratories) కూడా కొన్ని సెలెక్ట్ ప్యాక్‌ల ధరలను 1 నుంచి 10 శాతం వరకు పెంచాయి. హిందుస్థాన్ యూనిలీవర్ తన షాంపు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను మరింత ఖరీదుగా మార్చింది. నెస్లే (Nestle India) కాఫీ ధరలు 8 నుంచి 13 శాతం ఎగబాకాయి. మ్యాగీ (Maggi) ఓట్స్ నూడుల్స్ ధరలు 17 శాతం పెరిగితే, ఆశీర్వాద్ ‍‌(Aashirvaad) గోధుమపిండి ధరలు కూడా బాగానే హై జంప్‌ చేశాయి.


మరో ఆసక్తికర కథనం: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడంలో అత్యంత కీలకమైన 26ASను ఎలా డౌన్‌లోడ్‌ చేయాలి?