Income Tax Return Filing 2024: ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2023-24 లేదా అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25 కోసం ఆదాయ పన్ను పత్రాలు సమర్పించేందుకు మరో నెలన్నర మాత్రమే గడువు ఉంది. ఈ ఏడాది జులై 31వ తేదీ లోపు ఎలాంటి పెనాల్టీ లేకుండా ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR 2024) ఫైల్‌ చేయవచ్చు. ఈ గడువు దాటితే, కొంత లేట్‌ ఫైన్‌తో కలిపి డిసెంబర్‌ 31, 2024 వరకు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయవచ్చు. 


ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌లో ఫామ్‌ 26AS అవసరం ఏంటి?


ఫామ్ 26ASలో, పన్ను చెల్లింపుదారుకు సంబంధించిన పన్ను సంబంధిత పూర్తి సమాచారం ఉంటుంది. అంటే... TDS (Tax Deducted at Source), TCS (Tax Collected at Source), ముందస్తు పన్ను (Advance), సెల్ఫ్‌ అసెస్‌మెంట్ టాక్స్‌ (Self Assessment Tax) వంటివన్నీ అందులో నమోదై ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ సమాచారం అవసరం. మొత్తం పన్ను బాధ్యతను లెక్కించేందుకు ఈ సమాచారం పన్ను చెల్లింపుదారుడికి సాయపడుతుంది. దీంతో పాటు, మీరు ఇప్పటికే ఎంత పన్ను డిపాజిట్ చేశారు, ఇంకా ఎంత చెల్లించాలి, లేదా మీకే తిరిగి వస్తుందా (Refund) కూడా తెలుస్తుంది.


మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో జీతం, పెన్షన్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పొదుపు ఖాతా, అద్దె, మూలధన లాభాలు వంటి మొదలైన వాటి నుంచి ఆదాయం సంపాదించినట్లయితే... మీరు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవడానికి ఫామ్ 26AS అవసరం. ఈ ఫారాన్ని పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఫామ్‌-26AS డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ముందుగా, ఆదాయ పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్ incometaxindiaefiling.gov.in లోకి వెళ్లండి. 
మీ లాగిన్ ID (పాన్‌), పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్‌ అవ్వండి.
హోమ్‌ పేజీలో పైన కనిపించే e-File బటన్‌పైకి కర్సర్‌ను తీసుకువెళ్తే, ఒక డ్రాప్‌ డౌన్‌ విండో ఓపెన్‌ అవుతుంది.
అందులో Income Tax Returns మీదకు వెళ్లగానే, మరో విండోలో ఫామ్‌ 26-AS కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఇప్పుడు, Confirm బటన్‌ మీద నొక్కండి. ఇక్కడి నుంచి మీరు TRACES వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్‌ అవుతారు.
ఇక్కడ కనిపించే బాక్స్‌లో 'టిక్‌' పెట్టి, Proceed బటన్‌ మీద క్లిక్ చేయండి. ఫామ్‌ 26AS మీ స్కీన్‌ మీద ఓపెన్‌ అవుతుంది.
ఇప్పుడు,lick View Tax Credit (Form 26AS/Annual Tax Statement) మీద క్లిక్‌ చేయండి. 
దానిలో అసెస్‌మెంట్ సంవత్సరాన్ని, View Asలో HTML ఫార్మాట్‌ను ఎంచుకోవాలి.
6. ఇక్కడ View/Download బటన్‌ మీద క్లిక్‌ చేస్తే, టాక్స్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఓపెన్‌ అవుతాయి. ఆ ఫారాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఫామ్‌-26AS డౌన్‌లోడ్ చేయడం పూర్తయిన తర్వాత, దానిలో వివరాలను ఒకసారి సరి చూసుకోవాలి. దాని సాయంతో ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం:  పర్సనల్‌ లోన్‌పైనా ఆదాయ పన్ను మినహాయింపు - ఈ విషయం చాలామందికి తెలీదు