Residential Housing Sector: కరోనాకు ముందు, అఫర్డబుల్‌ హౌసింగ్‌ సెక్టార్‌కు ‍‌(Affordable Housing Sector) విపరీతమైన డిమాండ్‌ ఉంది. అఫర్డబుల్‌ హౌసింగ్‌లో.. ఇళ్లు మరీ ఇరుకుగా ఉండవు, అలాగని విశాలంగానూ ఉండవు. కాస్త సర్దుకుపోతే సౌకర్యంగా ఉంటాయి. కరోనా తర్వాత ట్రెండ్‌ మారింది. ఇళ్ల విషయంలో సర్దుకుపోవాలని ఇప్పుడు చాలామంది భావించడం లేదు. ఖరీదు ఎక్కువైనా పర్లేదు కాస్ట్‌లీగా, విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో, మన దేశంలో ఖరీదైన & విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. చౌక ఇళ్లకు డిమాండ్ వేగంగా తగ్గుతోంది. 


రియల్‌ ఎస్టేట్‌ డేటా ప్రకారం, 2019-2023 మధ్య కాలంలో, కోటిన్నర రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న విలాసవంతమైన ఇళ్లకు (Luxury Houses) డిమాండ్ దాదాపు 1000 శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలోకి సంపన్నులు. సంస్థాగత పెట్టుబడిదార్లు ప్రవేశించడంతో ఈ బూమ్ వచ్చింది. అంతేకాదు, ప్రస్తుతం దేశంలో 1.14 కోట్ల లగ్జరీ గృహాలు ఖాళీగా ఉన్నాయి. 


కేవలం 10 శాతం జనాభానే లక్ష్యం
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO) అధ్యక్షుడు జి హరిబాబు చెప్పిన ప్రకారం, 2022లో హైదరాబాద్‌లో 5,300 అందుబాటు ధరల ఇళ్లను (Affordable Houses) అమ్మారు. 2023లో ఈ సంఖ్య కేవలం 3,800 మాత్రమే. మన దేశంలో అతి కొద్దిమంది దగ్గర అధిక సంపద ఉంది. ఒక రీసెర్చ్‌ ప్రకారం, దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది దగ్గర దేశం మొత్తం సంపదలో 63 శాతం పోగుపడింది. ఈ 10 శాతంలోకి 14 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం, చాలా మంది బిల్డర్లు వీరినే టార్గెట్ చేస్తున్నారు. సంపన్నుల కోసమే లగ్జరీ ఇళ్లు నిర్మిస్తున్నారు. 


కొంటున్నారు, వాడడం లేదు
హరిబాబు చెప్పిన ప్రకారం, సంపన్న వ్యక్తులు ఈ ఇళ్లను కొంటున్నారు తప్పితే వాడుకోవడం లేదు. వాటిని అద్దెకు కూడా ఇవ్వడం లేదు. దాదాపు కోటికి పైగా ఇళ్లు ఖాళీగా ఉండడానికి ఇదే కారణం. ఓ పక్క జనం అద్దె ఇళ్లను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే, మరో పక్క ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. కేవలం పెట్టుబడి దృష్టితో కొనుగోలు చేసిన ఈ ఇళ్లను పెట్టుబడిదార్లు ఉపయోగించడం లేదు. మన దేశ జనాభాలో 60 శాతం మంది సొంతంగా ఇల్లు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని ఒక అధ్యయనం చెబుతోంది. సొంతింటి కోసం వారంతా పూర్తిగా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడుతున్నారు.


అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించేలా బిల్డర్లకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్లు పెట్టాలని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అందుబాటు ధరలో ఉండే ఇళ్లకు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మినహాయింపులు కూడా ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మార్పులు అఫర్డబుల్ హౌసింగ్ సెక్టార్‌ను దాదాపు 25 శాతం పెంచుతాయని అంటున్నారు. దీనివల్ల, దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు అందాబుటులోకి వస్తాయి.


2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్‌ భారత్‌) తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మన దేశ జనాభాలో 40 శాతం మంది ప్రజలు ఇప్పటికీ మురికివాడల్లోనే నివసిస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: భూటాన్‌లోనూ జెండా ఎగరేసిన అదానీ - గ్రీన్ హైడ్రో ప్లాంట్‌ కోసం MoU