Adani Group To Build Green Hydro Plant In Bhutan: వ్యాపార విస్తరణలో దూకుడుకు నిదర్శనం గౌతమ్‌ అదానీ. ఆయన సారథ్యంలో, అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు కొత్త రంగాల్లోకి, కొత్త ప్రాంతాల్లోకి దూసుకుపోతోంది. భారత్‌లోనే కాదు, విదేశాల్లో కూడా పెద్ద ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా, భూటాన్‌లో 570 మెగావాట్ల గ్రీన్ హైడ్రో ప్లాంట్‌ను నిర్మించేందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. భూటాన్‌ వెళ్లిన గౌతమ్ అదానీ, ఆదివారం నాడు, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ (Jigme Khesar Namgyel Wangchuck), ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే (Dasho Tshering Tobgay)తో సమావేశం అయ్యారు. ఆ దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులపై మాట్లాడారు.


సోషల్ మీడియాలో గౌతమ్‌ అదానీ పోస్ట్
"భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గేతో సమావేశం ఉత్తేజకరంగా జరిగింది. చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల గ్రీన్ హైడ్రో ప్లాంట్ కోసం 'డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌'తో (DGPC) అవగాహన ఒప్పందం కుదిరింది" అని అదానీ పోస్ట్‌ చేశారు. 


భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ దార్శనికతను ఆ దేశ ప్రధాని  దాషో షెరింగ్ టోబ్గే ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని గౌతమ్‌ అదానీ అన్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర మౌలిక సదుపాయాల కార్యక్రమాల అభివృద్ధిని నడిపిస్తున్నారని ప్రశంసించారు. భూటాన్‌లో హైడ్రో సహా ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయడానికి అదానీ గ్రూప్ ఆసక్తిగా ఉందని తెలిపారు. కార్బన్ న్యూట్రల్ కంట్రీగా మారేందుకు గ్రీన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో పాటు ఈ తరహా పరివర్తన పథకాలకు సహకరించడానికి తాను సంతోషిస్తున్నానని అదానీ రాశారు.






భూటాన్ రాజును కలిసిన తర్వాత కూడా మరో పోస్ట్‌ పెట్టాహరు. రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నాన్నట్లు వ్యాఖ్యానించారు. పొరుగు దేశంలో గ్రీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి దోహదపడే అవకాశం అదానీ గ్రూప్‌నకు రావడం పట్ల సంతోషిస్తున్నానని ఆ పోస్ట్‌లో రాశారు. గత ఏడాది నవంబర్‌లోనూ గౌతమ్ అదానీ భూటాన్ రాజుతో సమావేశం అయ్యారు. 






ఇటీవలే, అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్స్‌ కంపెనీ ఒక పెద్ద డీల్‌ను ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. పెన్నా సిమెంట్‌లో 100 శాతం వాటాను రూ.10.422 కోట్లకు అంబుజా సిమెంట్‌ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ పూర్తయిన తర్వాత, అంబుజా సిమెంట్ వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 14 మిలియన్ టన్నులు పెరిగి, మొత్తం 89 మిలియన్ టన్నులకు చేరుతుంది.


మరో ఆసక్తికర కథనం:  పర్సనల్‌ లోన్‌పైనా ఆదాయ పన్ను మినహాయింపు - ఈ విషయం చాలామందికి తెలీదు