Trivikram reaches Tirumala with family: ప్రముఖ దర్శకుడు, అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో గౌరవంగా 'గురూజీ' అని పిలుచుకునే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) చేరుకున్నారు. త్రివిక్రమ్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి కాలినడకన వెళ్లారు. ఆయన మెట్ల మార్గంలో వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే... ఈ సమయంలో ఆయన తిరుమల వెంకన్న దర్శనార్థం వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.



జనసేనాని పవన్ ఘన విజయం తర్వాత!
ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు చెందిన జనసేన పార్టీ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌లో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండు పార్లమెంటు స్థానాల్లో విజయ కేతనం ఎగుర వేసింది. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కూడా భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతే కాదు... 'పవన్ కళ్యాణ్ అను నేను' అంటూ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.


తెలుగు చిత్రసీమలో పవన్ ఆప్త మిత్రుడు ఎవరు? అని ప్రశ్నిస్తే... ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు. తాను ప్రజల కోసం పోరాడుతుంటే తన యోగక్షేమాలు చూసుకోవడానికి త్రివిక్రమ్ ఉన్నారని, తన సన్నిహితుల్లో త్రివిక్రమ్ ముఖ్యుడు అని జనసేన పార్టీ మీటింగుల్లో పవన్ చెప్పారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆప్త మిత్రుడి విజయం తర్వాత తిరుమలకు త్రివిక్రమ్ చేరుకోవడంతో స్నేహితుడి కోసం ఆయన ఏమైనా మొక్కుకున్నారా? స్వామివారికి ఆ మొక్కులు తీర్చుకోవడానికి విచ్చేశారా? అని చర్చ మొదలైంది. అదీ సంగతి!


Also Readఅమలా పాల్ ఇంట వారసుడొచ్చాడు... వారం తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్, పిల్లాడి పేరు ఏమిటంటే?






చేసింది మూడు సినిమాలే కానీ...
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు అంటే కేవలం మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. 'జల్సా'తో వాళ్లిద్దరి బంధం మొదలైంది. కానీ, అంతకు ముందు పవన్ హీరోగా 'అతడు' తీయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. 'జల్సా' తర్వాత 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాలు చేశారు. మధ్యలో పవన్ కోరిక మేరకు 'తీన్ మార్' చిత్రానికి సంభాషణలు అందించారు.


Also Readమీనాక్షీ చౌదరి... 27 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!



పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. ఒకానొక దశలో ఆయన సినిమాలకు దూరం అయ్యారు. అయితే, పవన్ మళ్లీ సినిమాలు చేసేలా కృషి చేసిన వ్యక్తుల్లో త్రివిక్రమ్ ఒకరు. 'దిల్' రాజు నిర్మాణంలో 'వకీల్ సాబ్' చేయడం వెనుక, 'భీమ్లా నాయక్' ప్రాజెక్ట్ వెనుక, 'బ్రో' సినిమాలోనూ  త్రివిక్రమ్ పాత్ర ఉంది. 


జనసేన పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు చెప్పి... సిల్వర్ స్క్రీన్ మీద పవర్ స్టార్ రీ ఎంట్రీలో త్రివిక్రమ్ తనవంతు పాత్ర పోషించారు. అందువల్ల, ఆయన తాజా తిరుమల దర్శనం ఇంత చర్చకు దారి తీసింది.