Flipkart Hotels: పండుగ సీజన్‌ సందర్భంగా, మరోమారు బిగ్‌ బిలియన్‌ డేస్‌ను జనం ముందుకు తీసుకురాబోతోంది ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart). సాధారణంగా, ఫ్లిప్‌కార్డ్‌ నుంచి ఏదైనా వస్తువును మనం ఆర్డర్‌ చేస్తాం. ప్రజలను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలు చేసే ఈ ఈ-కామర్స్‌ కంపెనీ, ఈసారి "సుపీరియర్‌ సర్వీసెస్‌"గా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. 


గతేడాది తాను కొనుగోలు చేసిన ట్రావెల్ వెబ్‌సైట్ క్లియర్‌ట్రిప్‌ (Cleartrip‌) భాగస్వామ్యంతో, ఫ్లిప్‌కార్ట్‌ హోటల్స్ (Flipkart Hotels) పేరిట హోటల్ బుకింగ్ సేవను కొత్తగా ప్రారంభించింది. తద్వారా ట్రావెల్ సెక్టార్‌లోనూ బలపడేందుకు అడుగు వేసింది.


ఫ్లిప్‌కార్ట్ హోటల్స్


ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ ద్వారా, దాదాపు 3 లక్షల దేశీయ & అంతర్జాతీయ హోటళ్లలో రూమ్‌లను బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణం, బుకింగ్స్‌కు సంబంధించి కొత్త ఆఫర్లతోపాటు; EMI ఆప్షన్లను కూడా కస్టమర్లకు అందిస్తుంది.


ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ ద్వారా, ఆఫర్డబుల్‌ (అందుబాటు ధరల్లో) హోటల్‌ స్టేను అందిస్తున్నట్లు మంగళవారం ఈ కంపెనీ ప్రకటించింది. ఇండియన్‌ కస్టమర్ల ట్రావెల్ బుకింగ్ అవసరాల కోసం 'వన్ స్టాప్ షాప్‌'గా ఫ్లిప్‌కార్ట్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించింది.


కొవిడ్‌ ఆంక్షలు ముగిసినప్పటి నుంచి భారతదేశంలోకి, విదేశాలకు ప్రయాణాలు, పర్యాటకుల సంఖ్య పెరిగాయి. ఈ అవకాశాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నిస్తోంది.


బ్యాంకులతో ఒప్పందం


ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న ఈ కొత్త సర్వీస్ ద్వారా, యూజర్లు థర్డ్ పార్టీ ఆఫర్లను కూడా పొందే వీలుంది. ఇలాంటి ఆఫర్ల కోసం బ్యాంకులతోనూ ఒప్పందం చేసుకుంది. బుకింగ్స్‌ సమయంలో, పార్ట్‌నర్‌ బ్యాంకుల కార్డులను ఉపయోగిస్తే, అందుబాటులో ఉన్న ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.


వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, ప్రస్తుత కస్టమర్లకు డిజిటల్ కామర్స్ ఆఫర్లను మరింత చేరువ చేసేందుకు, కొత్తవాళ్లను ఆకట్టుకునేందుకు క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేసింది. దీనివల్ల, ట్రావెల్ & టూరిజం మార్కెట్‌ను ట్యాప్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌కు వీలయింది. అంతేకాదు, మేక్‌మైట్రిప్‌ ‍(MakeMyTrip), యాత్ర (Yatra), బుకింగ్‌.కామ్‌ (Booking.com), ఈజ్‌మైట్రిప్‌ (EaseMyTrip) వంటి టూరిజం కంపెనీలతో పోటీ పడేలా క్లియర్‌ట్రిప్‌ను నిలబెట్టింది. 


Also read: విశాఖలోని బంగారు నగల కంపెనీ IPOకు వస్తోంది, టార్గెట్‌ రూ.201 కోట్లు


Also read: టాప్‌ గేర్‌లో టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్ - మీకు లిఫ్ట్‌ కావాలా?


అకామడేషన్‌ మార్కెట్‌లో డిమాండ్‌


దేశీయ, అంతర్జాతీయ అకామడేషన్‌ మార్కెట్‌లో డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుండడంతో, ఆతిథ్య పరిశ్రమకు 2022 కలిసి వస్తుందన్నది ఫ్లిప్‌కార్ట్ అంచనా. ప్రజలు టూరిజం అభిరుచి కూడా మారింది. ఎక్కువ మంది సందర్శించే ప్రాంతాలకు వెళ్లడం కంటే; పెద్దగా అంతగా తెలియని గమ్యస్థానాలు, వర్క్‌ స్టేషన్లకు వెళ్లడం, లాంగ్‌ స్టే, వెకేషన్ రెంటల్స్ వంటి కొత్త ప్రయాణ ట్రెండ్స్‌ ఇప్పుడు కనిపిస్తున్నాయి. 


టూరిజం ఇండస్ట్రీలో, గత రెండేళ్ళలో 60 శాతం CAGRతో పోలిస్తే గత త్రైమాసికంలో 70 శాతం వృద్ధి కనిపించింది. తదుపరి వచ్చే త్రైమాసికం మొత్తం పండుగల సీజనే. దీంతో ట్రావెల్‌ ఇండస్ట్రీకి ఆ త్రైమాసికం మరింత మెరుగ్గా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేసింది.