Vaibhav Jewellers IPO: విశాఖపట్నానికి చెందిన ప్రముఖ బంగారు నగల కంపెనీ వైభవ్ జ్యువెలర్స్ (Vaibhav Gems N' Jewellers Ltd), స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేందుకు తహతహలాడుతోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా నిధులు సేకరించబోతోంది. మొత్తం రూ.210 కోట్ల సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక.
ఐపీవో కోసం, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి మంగళవారం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది.
DRHPని సెబీ పరిశీలించి, సూచనప్రాయ ఆమోదం తెలిపిన తర్వాత ఈ కంపెనీ ఐపీవో తేదీలు, ప్రైస్ బ్యాండ్, లిస్టింగ్ తేదీలను త్వరలో ఖరారు చేస్తారు. ఐపీవో ముగిసిన తర్వాత వైభవ్ జ్యువెలర్స్ ఈక్విటీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలో లిస్ట్ అవుతాయి.
రూ.210 కోట్ల సమీకరణ
పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం... రూ.210 కోట్ల సమీకరణలో ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంది. ప్రమోటర్ సంస్థ గ్రంధి భరత మల్లికా రత్న కుమారి (HUF), తన దగ్గరున్న స్టేక్‌లో 43 లక్షల ఈక్విటీ షేర్లను (ఇదే ఓఎఫ్‌ఎస్ పోర్షన్) మార్కెట్‌లో అమ్మకానికి పెడతారు. ఈ 43 లక్షల షేర్లకు వచ్చే డబ్బు ప్రమోటర్ సొంత ఖాతాకు వెళ్తుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే డబ్బు కంపెనీ ఖాతాకు వెళ్తుంది.
కంపెనీ రూ.40 కోట్ల వరకు సమీకరించేందుకు అదనపు ఈక్విటీ షేర్ల ఇష్యూ గురించి కూడా పరిశీలిస్తోంది. ఈ ప్లేస్‌మెంట్ పూర్తయితే, ఫ్రెష్ ఇష్యూ సైజ్ తగ్గుతుంది.
ఫ్రెష్ ఇష్యూ ద్వారా కంపెనీకి వచ్చే ఆదాయంలో నుంచి, రూ.12 కోట్లను వెచ్చించి ఎనిమిది కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేస్తారు. మరికొంత మొత్తంతో FY23, FY24 కోసం రూ.160 కోట్ల విలువైన ఇన్వెంటరీని కొనుగోలు చేస్తారు. మిగిలిన సొమ్మును సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న వైభవ్ జ్యువెలర్స్... బంగారం, వజ్రాలు, రత్నాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు లేదా వస్తువులకు సంబంధించి వివిధ శ్రేణుల్లో విభిన్న రకాల ఉత్పత్తులను అందిస్తోంది. దీనికి, విశేష
(Visesha) పేరిట ఒక సబ్ బ్రాండ్ కూడా ఉంది. సంపన్నులు మాత్రమే కొనగలిగే, ఇష్టపడే బంగారు, వజ్రాభరణాలను ఈ సబ్ బ్రాండ్ ద్వారా విక్రయిస్తున్నారు. అంటే, ఇది ప్రీమియం బ్రాండ్.
వైభవ్ జ్యువెలర్స్‌ను 1994లో స్థాపించారు. ప్రస్తుతం, గ్రంధి భారత మల్లిక రత్న కుమారి తన కుమార్తె గ్రంధి సాయి కీర్తనతో కలిసి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.
14 శాతం మార్కెట్ వాటా
టెక్నోపాక్ నివేదిక ప్రకారం, FY21లో, వ్యవస్థీకృత (ఆర్గనైజ్‌డ్) మార్కెట్‌లో ఈ సంస్థకు సుమారు 14 శాతం మార్కెట్ వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా వ్యాపారం చేస్తోంది. ఇదే వ్యాపారంలో ఉన్న తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, జీఆర్‌టీ జ్యువెలర్స్, జోయాలుక్కాస్ దీనికి పోటీ కంపెనీలు.
FY22లో కార్యకలాపాల ద్వారా కంపెనీకి వచ్చిన ఆదాయం (ఆపరేటింగ్ రెవెన్యూ) రూ.1,694 కోట్లుగా ఉంది.
బజాజ్ క్యాపిటల్ లిమిటెడ్, ఎలారా క్యాపిటల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆఫర్‌కు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు పని చేస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.