Supreme Court On Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యలపై ప్రభావిత రాష్ట్రాలన్నింటితో వెంటనే చర్చలు మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 7కు వాయిదా వేసింది. పొలవరం ప్రాజెక్టు కారణంగా తలెత్తిన సమస్యలను తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఇదివరకే ప్రస్తావించాయి. ఆ ప్రాజెక్టుతో కొన్నిచోట్ల వరద ముంపు తలెత్తుతుందని పేర్కొనగా, మొదట్లో తెలిపిన ప్రకారం కాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్టును విస్తరించడంతో సమస్యలు మొదలయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతుల మేరకు నిర్మాణం జరిగిందో లేదో మరోసారి సమీక్షించాలని ధర్మాసనాన్ని ఈ మూడు రాష్ట్రాలు కోరాయి. భాగస్వామ్య పక్షాలన్నింటితో కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర జల్‌శక్తి, పర్యావరణ శాఖలు భాగస్వాములందరితో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్టాలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను డిసెంబరు 7కు వాయిదా వేసిన ధర్మాసనం.. అంతకుముందే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, తొలి సమావేశం ఈ నెలలోనే ప్రారంభమవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ముందే నివేదిక సమర్పించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఏ రాష్ట్రం, ఏ సమస్య లేవనెత్తింది..
పోలవరం ప్రాజెక్టు కారణంగా వరద ముంపు తలెత్తుతోందని, పరిష్కార మార్గాలు చూపించాలని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వ్యాఖ్యలు దాఖలుచేశాయి. ప్రాజెక్టుకు మొదట్లో ఇచ్చిన అనుమతులు, ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం అలాగే జరిగిందో లేదో పర్యావరణ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఒడిశా. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. బచావత్ అవార్డుకు అతీతంగా ఏపీ పోలవరం ప్రాజెక్టును మార్చింది. దీంతో ఒడిశా ప్రజలు ముంపుబారిన పడుతున్నారని, 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులతో పోలిస్తే.. ప్రస్తుతం ప్రాజెక్టు స్వరూపం మారిపోయిందని ఒడిశా తరఫున సీనియర్ లాయర్ గోపాల సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. కేంద్రం ఒకానొక దశలో నిర్మాణ పనులను నిలిపేయాలని ఉత్తర్వులిచ్చిందని చెప్పారు.
ఈ కేసు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినదని, జలాల పంపిణీకి ఏ సంబంధం లేదు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఎగువన రెండు ప్రాజెక్టులు నిర్మించాలి. అప్పుడు గోదావరి నదిలో నీటిమట్టం సరైన విధంగా ఉంటుందని, కానీ పోలవరం ఒక్కటే నిర్మిస్తున్నందున ఒడిశా ప్రజలు ముంపుబారిన పడతారని వాదనలు వినిపించారు. 1994 పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాజెక్టును స్పష్టమైన పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించకుండా ఉత్తర్వులివ్వాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయి నుంచి 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయికి ప్రాజెక్టును నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా చేయాలంటే కొత్తగా అనుమతులు తీసుకోవాలని, ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని కోరారు.
తెలంగాణ ఏమంటోంది..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని తెలంగాణ కోరడం లేదని సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేయాలని ఒడిశాల తాము కోరడం లేదని, సమస్యను పరిష్కరించేంతవరకూ పోలవరంలో నీళ్లు నిల్వ చేయొద్దని సుప్రీంకోర్టుకు విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం.. గోదావరిలో వరద ప్రభావం 50 లక్షల క్యూసెక్కుల వరకూ ఉంటుందని, దానివల్ల చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో భద్రాచలం ఆలయంతో పాటు పలు ప్రాంతాలు పూర్తిగా మునిగిందని గుర్తుచేశారు.
ఛత్తీస్ గఢ్ వాదన ఏంటంటే..
రిజర్వాయర్ నిర్మాణ పరిధిని 150 అడుగుల నుంచి 177 అడుగులకు పెంచడంతో బ్యాక్‌వాటర్ ముంపు పెరుగుతోందని ఛత్తీస్‌గఢ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఏపీ వాదన ఇది..
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఏపీ ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదన వినిపించారు. ఇది ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు కాదని, కేంద్రం నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అన్నారు. ఇది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి.. ఇందులో ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ఇతర రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్టుకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యావరణ అనుమతుల సమస్యనూ పరిష్కరించాలని విన్నవించారు.