3 Lakhs Loan With Kisan Credit Card: వ్యవసాయాభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వం రైతులకు చాలా సౌకర్యాలు కల్పిస్తోంది. వ్యవసాయం చేసే సమయంలో రైతులు ఎదుర్కొనే కీలక ఇబ్బంది.. పెట్టుబడికి అవసరమైన డబ్బు. సకాలంలో డబ్బు సర్దుబాటు కాక, ఆర్థిక సమస్యల వల్ల రైతులు కాడిని వదిలేస్తున్నారు. దీనికి పరిష్కారంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీని ద్వారా, రైతులు చాలా తక్కువ వడ్డీకి స్వల్పకాలిక రుణం పొందొచ్చు.


వ్యవసాయ కార్యకలాపాల్లో ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయదార్లకు 4 శాతం వడ్డీ రేటుతో (పావలా వడ్డీ రుణం) రూ. 3 లక్షల వరకు బ్యాంక్‌ లోన్‌ లభిస్తుంది. రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకునే అప్పులతో పోలిస్తే ఈ రుణం చాలా చౌక. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద రైతులు సులభంగా రుణాలు పొందుతారు. కర్షకులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.


KCC ఉన్న రైతులకు రుణంతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా లభిస్తాయి. KCC హోల్డర్‌కు బీమా రక్షణ ఉంటుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ ఉన్న రైతు మరణిస్తే, బీమా కంపెనీ నుంచి అతని కుటుంబానికి రూ. 50,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ ఆ రైతు శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 50,000 వరకు సాయం లభిస్తుంది. ఇతర నష్టాలకు రూ. 25,000 వరకు బీమా రక్షణ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు రైతులకు పొదుపు ఖాతా, స్మార్ట్ కార్డ్‌, డెబిట్ కార్డ్‌ అందిస్తారు. ఆ ఖాతాలో చేసే పొదుపుపై​వడ్డీ వస్తుంది. తీసుకున్న లోన్‌ను తిరిగి చెల్లించే విషయంలోనూ KCC కార్డ్‌ హోల్డర్‌కు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. రుణం తిరిగి చెల్లించడానికి రైతుకు 3 సంవత్సరాల వరకు సమయం లభిస్తుంది.


కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరికి ఇస్తారు? ‍‌(KCC Eligibility)


-- వ్యవసాయ భూమి యజమానులు (ఆ భూమిని వీళ్లు సాగు చేస్తుండాలి) 
-- కౌలు రైతులు
-- మత్స్యకారులు
-- ఆక్వా రైతులు 
-- రైతు సంఘాల గ్రూప్‌లోని వ్యక్తులు ‍‌(వ్యవసాయం చేస్తున్న వ్యక్తులై ఉండాలి)
-- గొర్రెలు, కుందేళ్లు, మేకలు, పందులు, పక్షులు, కోళ్ల పెంపకం రైతులు 
-- పశు పోషణ వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్న రైతులు లేదా పాడి రైతులు


కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే రైతు వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, 75 సంవత్సరాలకు మించకూడదు.


అవసరమైన పత్రాలు (Required Documents To Apply for Kisan Credit Card)


-- దరఖాస్తు ఫారం
-- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్‌. ఇవి దరఖాస్తుదారు ప్రస్తుత చిరునామాతో ఉండాలి
-- భూమి పత్రాలు
-- దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో
-- బ్యాంక్ కోరిన సెక్యూరిటీ పత్రాలు


కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి (How to Apply For Kisan Credit Card Online?)


-- KCC పథకం ప్రయోజనాలను పొందేందుకు, రైతులు కోరుకున్న బ్యాంక్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
-- హోమ్‌పేజీలో కనిపించే ఆప్షన్స్‌ నుంచి కిసాన్‌ క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ ఎంచుకోండి.
-- అప్లై బటన్‌ మీద క్లిక్ చేయండి.
-- ఇప్పుడు, స్క్రీన్‌ మీదకు ఒక దరఖాస్తు ఫారం వస్తుంది.
-- అక్కడ అడిగిన వివరాలన్నీ నింపి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
-- మీరు సమర్పించిన వివరాలను బ్యాంక్‌ ధృవీకరించుకుంటుంది.
-- అన్నీ సరిగా ఉంటే, కొన్ని రోజుల్లో KCC జారీ అవుతుంది.


ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు కోసం... మీరు కోరుకున్న బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి KCC అప్లికేషన్‌ ఫారం నింపండి. ఆ ఫారానికి, అవసరమైన రుజువు పత్రాలు జత చేసి బ్యాంక్‌లో సమర్పించండి. మీ దరఖాస్తును బ్యాంక్‌ ప్రాసెస్‌ చేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: 10 గ్రాముల పసిడి రూ.100 కన్నా తక్కువే - కొనాలంటే టైమ్‌ మెషీన్‌ ఎక్కాలి