Gold Price History: బంగారం అనేది భారతీయులకు ఒక పాజిటివ్ సెంటిమెంట్. యుగాలుగా, మన దేశ సంస్కృతి & సంప్రదాయాల్లో పసిడి ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఎలాంటి వేడుకలోనైనా పుత్తడిని శుభప్రదమైన వస్తువుగా భావిస్తారు. అంతేకాదు, ఇది నమ్మదగిన పెట్టుబడిగానూ మారింది, దాని ప్రాముఖ్యత క్రమంగా పెరిగింది. ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతదేశంలోనే 11% పైగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఎల్లో మెటల్ డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతుండేసరికి, ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం, భారతదేశ మల్టీ కమొడిటీ ఎక్సేంజ్‌లో (MCX) 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) రేటు దాదాపు రూ. 72,000కు చేరుకుంది. ప్రభుత్వం విధించే పన్నులు కూడా దీనికి కలిపితే స్పాట్ గోల్డ్ రేటు వస్తుంది. అయితే, ఒకప్పుడు. మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 100 కన్నా తక్కువగా ఉండేదని మీకు తెలుసా?.
బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం, 1964లో భారతదేశంలో 10 గ్రాముల బంగారం (24 కేరెట్లు) ధర రూ. 63.25. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోల్చి చూస్తే, బంగారం ధరలో పెను మార్పు కనిపిస్తుంది. 1964 నుంచి ఇప్పటి వరకు, స్వర్ణం విలువ దాదాపు 1130 రెట్లు పెరిగింది.
భారత్‌లో బంగారం ధరల చరిత్ర (Gold price history since 1964)
1964 ------ రూ. 63.25
1965 ------ రూ. 71.75
1970 ------ రూ. 184
1975 ------ రూ. 540
1980 ------ రూ. 1330
1985 ------ రూ. 2,130
1990 ------ రూ. 3200
1995 ------ రూ. 4,680
2000 ------ రూ. 4,400
2005 ------ రూ. 7,000
2010 ------ రూ. 18,500
2015 ------ రూ. 26,343
2020 ------ రూ. 48,651
2021 ------ రూ. 48,720
2022 ------ రూ. 52,670
2023 ------ రూ. 63,820
2024 (ఇప్పటి వరకు) ------ రూ. 71,743
బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. ఒక్కోసారి కొన్ని వందల రూపాయలు తగ్గుతాయి, మరోమారు పెరుగుతుంటాయి. కానీ.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం పెరిగే ధోరణినినే (upward trend) కొనసాగిస్తున్నాయి. గత 10 సంవత్సరాల్లోనే పసిడి రేట్లు రెట్టింపు పైగా పెరిగాయి. 2023లో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, US వడ్డీ రేట్లలో మార్పులు, ద్రవ్యోల్బణం కారణంగా, కేవలం 10 నెలల్లోనే గోల్డ్ రేటు 10% పెరిగింది. ధరల్లో స్థిరమైన పెరుగుదల కారణంగా, దీర్ఘకాల పెట్టుబడి ఎంపికగా బంగారం ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగా (safe haven) నిలుస్తోంది.
బంగారం ధరలను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?
మన దేశంలోనే కాదు, గ్లోబల్ మార్కెట్‌లోనూ ఎల్లో మెటల్ రేట్లు నిరంతరం మారుతుంటాయి. గ్లోబల్ డిమాండ్, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వివిధ ప్రభుత్వాల విధానాలు, ఆర్థికపరమైన మార్పులు వంటివి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి, భారతదేశంలోని బంగారం ధరలకు కూడా ఈ కారణాలే వర్తిస్తాయి. దీంతోపాటు... ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ పెరిగి పసిడి రేట్లు పెరుగుతాయి.
మరో ఆసక్తికర కథనం: సుందర్ పిచాయ్ మామూలోడు కాదు - గూగుల్‌ను ఓ ఆట ఆడించాడు