TGSRTC: సికింద్రాబాద్ వెళ్లాల్సిన శ్రీనివాస్‌ హయత్‌నగర్‌లో బస్ ఎక్కాడు. కండాక్టర్‌ టికెట్‌ కొట్టి ఇచ్చాడు. 40 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. శ్రీనివాస్‌ మెల్లిగా ఐదు వందల రూపాయల నోట్ తీసి కండాక్టర్ చేతిలో పెట్టాడు. అసలే ఫస్ట్ ట్రిప్‌ కావడంతో చిల్లర లేదని చెప్పి టికెట్‌పై 460 అని రాసి ఇచ్చాడు. ఫోన్ చూస్తూ తను దిగాల్సిన స్టాప్‌లో దిగిపోయాడు. 460 రూపాయలు మర్చిపోయాడు. 40 రూపాయలు చిల్లర లేనందుకు శ్రీనివాస్‌కు 460 చెల్లించుకోవాల్సి వచ్చింది. 


ఇది ఒక్క శ్రీనివాస్‌ అనుభవమే కాదు. మీరు హైదరాబాద్‌లో ఉండి ఉంటే కచ్చితంగా ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసి ఉంటారు. ఆ కండాక్టర్ మంచి వాడు కాబట్టి చీటీపీ రాసి ఇచ్చాడు. వేరే వాళ్లు అయితే ఏకంగా వాగ్వాదమే పెట్టుకుంటారు. చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలని చిర్రుబుర్రులాడుతారు. 


ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్‌ సిటీ బస్‌లలో డిజిటల్ పేమెంట్స్ తీసుకురానుంది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రక్రియ విజయవంతం కావడంతో ఇప్పుడు మరికొన్ని రూట్‌లలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. 


ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించే వాళ్లకు చిల్లర బాధ అంతా ఇంతా కాదు. డిజిటల్ చెల్లింపులు వచ్చాక బయట చిల్లర దొరకడమే కష్టంగా మారిపోయింది. ఏటీఎంకు వెళ్లినా అక్కడ కూడ వంద, 200, 500 నోట్‌లే వస్తున్నాయి. దీంతో బస్‌ ఎక్కే వాళ్ల వద్ద చిల్లర కనిపించడం చాలా అరుదు. దీంతో నిత్యం ఆర్టీసీ సిబ్బందితో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 


ఇలాంటి పరిస్థితిని గమనించిన తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను బండ్లగూడ డిపోలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. ఇది  విజయవంతం కావడంతో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మిగతా ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది. బండ్లగూడలోని 70 బసుల్లో ఫోన్‌పై, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు ఉంటే టికెట్ తీసుకోవచ్చు. సుమారు నెల రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుందీ ప్రక్రియ. 


బండ్లగూడ డిపో బసుల్లో డిజిటల్ చెల్లింపుతో టికెట్ తీసుకోవడంలో ఉన్న లోపాలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రయాణికుల ఇబ్బందులు, టికెట్ ఇవ్వడానికి చెల్లింపులకు ఎంత టైం పడుతుంది ఇలా అన్నింటినీ పరిశీలించింది ఆర్టీసి. పెద్దగా సాంకేతిక సమస్యలు తలెత్తలేదని గ్రహించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ఆలోచనలో ఉందీ ఆర్టీసీ. 


గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 2900 బస్సుల్లో ఈ డిజిటల్ చెల్లింపు ప్రక్రియను త్వరలోనే ప్రవేశ పెట్టనున్నారు. దీని వల్ల 15 లక్షల మందికిపైగా ప్రయాణికులకు మేలు జరుగుతుందని సిబ్బందిపై చిల్లర ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.