Russia-Ukraine Tensions, Crude oil prices: రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచానికి ప్రాణ సంకటంగా మారుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2014 నాటి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఎనిమిదేళ్ల గరిష్ఠమైన బ్యారెల్‌కు 100 డాలర్లకు పెరిగింది.


యుద్ధ భయం వల్లే


'ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లకు పైగా చేరుకొనే అవకాశం ఉంది' అని ఆయిల్‌ బ్రోకర్‌ పీవీఎం థామస్‌ వర్గా అంటున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ధరలు ఇంకా పైకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 3.48 డాలర్లు పెరిగి ప్రస్తుతం 98.87 డాలర్లుగా ఉంది. అంతకు ముందు ఇది 99.38 డాలర్లకు చేరుకుంది. 2014 తర్వాత ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.


ఇరాన్‌ ఉత్పత్తి పెంచితే


అమెరికా మార్కెట్లోనూ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కొండెక్కుతున్నాయి. అయినప్పటికీ ముడి చమురు ఉత్పత్తిని పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాలైన ఓపెక్‌ కూటమి అంగీకరించడం లేదు. వారి నిర్ణయంపై నైజీరియా పెట్రోలియం మంత్రి మండిపడ్డారు. ఇరాన్‌పై న్యూక్లియర్‌ డీల్‌ను పునరుద్ధరిస్తే సరఫరా కొరతకు తావుండదని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వారిపై ఆంక్షలు తొలగిస్తే రోజుకు పది లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాన్‌ ఉత్పత్తి చేయగలదు.


భారత్‌లో చుక్కలే


ముడి చమురు ధరలు పదిశాతం పెరిగాయంటే భారత్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం ౦.5 శాతం, టోకు ధరల ద్రవ్యోల్బణం 1 శాతం పెరుగుతుంది. ఎన్నికల వాతావరణం ఉండటంతో మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్‌ ధరల్లో మార్పు చేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మార్చి 10 నుంచి లీటరుకు రూ.8-10 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి.


రష్యా నుంచే అధిక భాగం ముడి చమురు ఐరోపా, ఆసియాకు వస్తుంది. ఒకవేళ రష్యా, ఉక్రెయిన్‌ వివాదం ముదిరి సరఫరా, గిరాకీలో సమతుల్యం దెబ్బతింటే ధరలు పెరగడం గ్యారంటీ. అప్పుడు సరకు రవాణాపై భారం పెరుగుతుంది. కూరగాయాల నుంచి విమాన ప్రయాణాలకు వరకు ధరల మోత మోగుతుంది!


RBI ఏం చేస్తుందో


ప్రస్తుతానికి ఆర్‌బీఐ రెపో, రివర్స్‌ రెపో పెంచే అవకాశాలైతే కనిపించడం లేదు. ఒకవేళ పెంచినా మొదట లిక్విడిటీ కోసం రివర్స్‌ రెపోను పెంచుతారు. ప్రస్తుతం ఆయిల్‌ రిఫైనరీలు నష్టాల్లో ఉన్నాయి! ముడిచమురు 75 డాలర్ల వద్ద ఉన్నప్పటి ధరనే అమలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ధర 95 డాలర్లు దాటేసింది. మార్చి 10న పెట్రోలు ధరలు పెంచగానే మిగతా అన్నింటి ధరలూ పెరగడం మొదలవుతాయి. ఒకవేళ ఇరాన్‌ ముడి చమురు ఉత్పత్తి పెంచి భారత్‌కు సరఫరా చేస్తే ధరలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు.


Also Read: ఉక్రెయిన్‌లో హైటెన్షన్- విద్యార్థులారా వచ్చేయండి, విమానాలు పంపిస్తున్నాం!