Retail Inflation Data For August 2023: దేశంలో ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా టొమాటోల ధరలు తగ్గడం వల్ల ఈ ఏడాది ఆగస్టులో చిల్లర ద్రవ్యోల్బణం శాంతించింది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail Inflation) ఆగస్టులో 6.83 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెల జులైలో ఇది 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి చేరుకుంది. దీనికి ముందు, జూన్ నెలలో ద్రవ్యోల్బణం రేటు 4.81 శాతంగా నమోదైంది. 2022 ఆగస్టులో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ రేటు 7 శాతంగా ఉంది.
ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల
దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం లెక్కలను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ గణాంకాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 7.63 శాతం నుంచి 7.02 శాతానికి తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో 7.20 శాతం నుంచి 6.59 శాతానికి దిగి వచ్చింది. అదే సమయంలో, 2023 జులై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గింది, 10 శాతానికి దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి పరిమితమైంది.
ఆహార పదార్థాల ధరల పరిస్థితి
జులైలో 37.34 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఆగస్టులో 26.14 శాతానికి తగ్గింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది, జులైలోని 13.27 శాతం నుంచి ఆగస్టులో 13.04 శాతానికి చేరింది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం జులైలో 21.53 శాతంగా ఉండగా 23.19 శాతానికి పెరిగింది. పాలు & పాల సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.73 శాతంగా ఉంది, ఇది జులై 2023లో 8.34 శాతంగా ఉంది. అంటే, పాలు & సంబంధిత ఉత్పత్తుల ధరలు కూల్ అయ్యాయి. ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం గత నెలలో 13.04 శాతంగా తేలింది, అంతకుముందు 11.85 శాతంగా ఉంది. చమురు & కొవ్వుల ద్రవ్యోల్బణం -15.28 శాతంగా ఉంది, జులైలో 16.80 శాతంగా నమోదైంది. మాంసం, చేపలు, గుడ్లు, చక్కెర, తీపి పదార్థాలు, ఆల్కాహాలేతర పానీయాలు, పండ్లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం, చిరుతిండ్ల ధరలు కూడా చల్లబడ్డాయి.
RBI టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువే..
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2023 జులైలోని 7.44 శాతం నుంచి ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ, ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ (RBI) టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి, ఆర్‌బీఐ టాలరెన్స్ బ్యాండ్‌ను 2-6 శాతంగా నిర్ణయించింది.
త్రైమాసికాల వారీగా... 2023-24 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 5.2 శాతం, రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) 6.2 శాతం, మూడో త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 5.7 శాతం, నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి) 5.2 శాతంగా ఇన్‌ఫ్లేషన్ రేట్ నమోదు కావొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో CPI ఇన్‌ఫ్లేషన్ 5.4 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Vedanta, DMart, Paytm
Join Us on Telegram: https://t.me/abpdesamofficial