Telangana Elections :   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని పార్లమెంట్ తో పాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడం అనేదే లేదు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవి కాలం పూర్తయ్యే లోపు కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేలా ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికలు నిర్వహించలేని సందర్భమే లేదు. ఎన్నికలు నిర్వహించి తీరాలి. ఎందుకంటే అది రాజ్యంగ నిబంధన కానీ ఈ సారి జమిలీ ఎన్నికల ఆలోచనలో ఉన్న కేంద్రం.. మొదటి సారి మినీ జమిలీకి ప్లాన్ చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంగా ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసి మరీ డిసెంబర్ లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఆలస్యం చేస్తారని అంటున్నారు. నిజంగా ఇలా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి ఏమిటన్నది అప్పుడే చర్చనీయాంశంగా మారింది. 


ప్రభుత్వ పదవీ కాలాన్ని పెంచుతారా ?


మినీ జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే.. ఎన్నికలు మేలో జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం జనవరి రెండో వారానికి ముగిసిపోతుంది. మరి ఎన్నికలు జరిగే మే వరకూ ఏ ప్రభుత్వం పాలన చేస్తున్నారు. అసలు ప్రజాప్రతినిధులే ఉండరు కాబట్టి.. ప్రభుత్వం అనే మాటే రాదు. ఆపద్ధర్మ సీఎం అనే మాట వినిపించే అవకాశం లేదు. అలాగని.. ప్రభుత్వాన్ని మరికొంత కాలం పొడిగించే చాన్స్ అసలు లేదు. రాజ్యాంగ సవరణలో ప్రభుత్వ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ఏమైనా మార్పులు చేస్తే..  అప్పుడు అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వాన్ని కొత్తగా చేసే సవరణ ద్వారా పొడిగించడం ఎలా సాధ్యమన్న సందేహం ఎవరికైనా వస్తుంది.  ఐదేళ్ల పదవీ కాలానికి మాత్రమే ప్రజలు ఓట్లేశారు. అంతకు మించి పదవిలో ఉండటానికి రాజ్యాంగం అంగీకరించదు. 


రాష్ట్రపతి పాలన విధిస్తారా ?


ఇలాంటి పరిస్థితి వస్తే ఎక్కువగా అవకాశం ఉన్న చాయిస్..రాష్ట్రపతి పాలన.  సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రయోగాలు చేయకపోయినా.. ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం ఐదు రాష్ట్రాల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే రాష్ట్రపతి పాలన విధించడం అనేది చాలా తేలికైన ఆప్షన్. అదే ప్రభుత్వాల అధికారాన్ని పొడిగిస్తే భవిష్యత్‌లో చాలా సమస్యలు వస్తాయి. అందుకే రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా.. సమస్యను సులువుగా అధిగమించే అవకాశం ఉంది. ఇది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. తెలంగాణ, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్ర పాలన వచ్చినట్లే. ఎన్నికలకు ఇది అడ్వాంటేజ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 


భారత రాష్ట్ర సమితి వ్యూహం ఏమిటి ?


ప్రభుత్వాల పదవీ కాలాన్ని పొడిగిస్తే.. బీఆర్ఎస్ జమిలీ ఎన్నికల విషయంలో ఇష్టం లేకపోయినా... అంగీకరించే అవకాశం ఉంది. కానీ.. రాష్ట్రపతి పాలన విధిస్తామంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరు అన్న ఊహను బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేయలేవు. అధికార పగ్గాలు కేసీఆర్ చేతుల్లో లేకుండా ఐదారు నెలలు కేంద్ర పాలన సాగిందంటే ఎన్నో రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకే   రాష్ట్రపతి పాలన తర్వాత ఎన్నికలంటే బీఆర్ఎ్ అంగీకరించే అవకాశం ఉంది.  అలాగే కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుంది. 


అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీకి అధికారం ఉంది. మెజార్టీ ఉంది. అందుకే తాను చేయాలనుకున్నది చేస్తుంది.