Chandrababu Arrest: అక్రమ కేసులతో టీడీపీ నేతలు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని నందమూరి, నారా కుటుంబ సభ్యులు అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నందమూరి రామకృష్ణ, నారా రోహిత్, భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, తామంతా ఒకరికొకరం అండగా ఉంటూ ముందుండి నడిపిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చంద్రబాబు క్లీన్ చిట్‌తో బయటకు వస్తారన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ.. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసు నకిలీ కేసు అన్నారు. చంద్రబాబును, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడం కోసం చేసిన ఫేక్ గేమ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ కేసులో క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని అన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరి కోసం చంద్రబాబు పని చేస్తారని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వం ఆయన్ను ఇబ్బంది పెట్టలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే చంద్రబాబుపై ఫేక్ కేసును ఆయనపై రుద్దుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లోఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఆధారాలు ఎక్కడా లేవన్నారు.
నందమూరి రామకృష్ణ, భరత్ మాట్లాడుతూ.. ‘మీడియాతో సాక్ష్యాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా ఆయన్ను ఎలా అరెస్టు చేశారు? కేసులో నిజంగా ఆధారాలు దొరికితే రెండున్నరేళ్లు ఎందుకు ఆగారు. అన్ని వ్యవస్థల అండతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. షెల్ కంపెనీలకు చంద్రబాబుకు ఏంటి సంబంధం? చంద్రబాబు వయసుకు తగిన గౌరవం కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు పెళ్లి రోజు చూసుకొని మరీ అరెస్టు చేశారు’ అని అన్నారు.
‘మా కుటుంబం అంతా ప్రజాక్షేత్రంలో పోరాడుతాం. ప్రభుత్వ వైఫల్యాలు, చేతగాని తనంపై ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మాది. యువతకు మంచి చేయాలనే గత ప్రభుత్వం స్కిల్ డెవెలప్‌మెంట్ పథకం అమలు చేసింది. నైపుణ్యాభివృద్ధి ద్వారా శిక్షణ పొందిన వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. అన్ని వ్యవస్థల అండతో ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. జగన్ రాసిన స్క్రిప్ట్‌ను అధికారులు అమలు చేశారు. చంద్రబాబు వయసు, హోదాకు కూడా గౌరవం ఇవ్వలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నారా భువనేశ్వరి ఏమన్నారంటే !
అంతకు ముందు నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్మించిన జైల్లోనే ఆయనను కట్టిపారేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రత గురించి మాట్లాడుతూ.. అధికారులు భద్రత కల్పిస్తున్నా తనకు ఇంకా భయంగా ఉందన్నారు. తనలో సగ భాగాన్ని జైల్లో వదిలేసి వచ్చినట్లు ఉందన్నారు. ప్రజల హక్కు, స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తిని వేధిస్తున్నారని.. మీరంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇది కుటుంబానికి, టీడీపీ క్యాడర్ కు, పార్టీ శ్రేణులకు ఇది కష్టకాలం అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఎన్నటికీ పార్టీ కోసం నిలుస్తుందన్నారు.
ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ చంద్రబాబు భార్యగా జైలుకు వెళ్లి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఆయన సెక్యూరిటీపై ఇంకా భయంగా ఉందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి నెంబర్ 1 సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన ఆమె.. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. జైలులోనూ ప్రజల గురించే చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఎప్పుడు బయటకు వస్తాను ప్రజలకు సేవ చేయాలని అన్నారని భువనేశ్వరి చెప్పారు.