Stephen Ravindra: మహారాష్ట్ర, హర్యానాకు చెందిన రెండు గంజాయి ముఠాలను పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు కేసుల్లో కలిపి 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన 1228 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఒక పిస్టల్, మూడు వాహనాలు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు. అరకు నుంచి షోలాపూర్, ఔరంగాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్నారని.. ఒక డీసీఎంలో గంజాయి తరలిస్తుండగా వారిని చేజ్ చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. రెండు కేసుల్లో కలిసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై గతంలో కూడా కేసులు ఉన్నాయన్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 


నిందితులు 30 ఏళ్ల ఇనామ్ మహమ్మద్(ఏ1), 26 ఏళ్ల బంతి కశ్యప్(ఏ2), 21 ఏళ్ల మహమ్మద్ సాద్(ఏ4) ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే 20 ఏళ్ల లలిత్ కుమార్ కశ్యప్ రాజ్ పుత్(ఏ3) హర్యానాకు చెందిన వాడు కాగా..  బబ్లూ షిండే(ఏ5) మహారాష్ట్ర, సుభాష్(ఏ6) ఏపీకి చెందిన వాళ్లని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఇనామ్ మహమ్మద్ పై ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. యూపీలోని కొత్వాల్ పీఎస్ లో 3, సివిల్ లైన్ పీఎస్ లో 2, సదర్ బజార్ పీఎస్ లో 2, కంకేర్ ఖేరా పీఎస్ లో 3, కథౌలి పీఎస్ లో ఒక కేసు నమోదు అయ్యాయని వివరించారు. 


ఏ1 నిందితుడు ఇనామ్ మహమ్మద్ విలాస వంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాడు. ఇంటర్ లోనే చదువు మానేసిన ఇతడు.. అనేక నేరాలకు పాల్పడ్డాడు. యూపీ పోలీసులు ఇతడిని చాలా సార్లు అరెస్ట్ చేశారు. ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులు విశాఖపట్నం అరకులోయ నుంచి హైదరాబాద్ మీదుగా... మహారాష్ట్రలోని షోలాపూర్ కు అక్రమంగా గంజాయి రావాణా చేస్తున్నారు. ఏ6 నిందితుడు సుభాష్ నుంచి గంజాయి సేకరించి మహారాష్ట్రలోని ఏ5 నిందితుడు బబ్లూ షిండేకు సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే తాజాగా సుభాష్ నుంచి 508 కిలోల ఎండు గంజాయిని తెప్పించుకునేందుకు బబ్లూ షిండే ప్లాన్ చేశాడు. అందుకుగాను రూ.4.5 లక్షల రూపాయలను కూడా చెల్లించాడు. ఈక్రమంలోనే ఏ1, ఏ4 నిందితులు మహీంద్రా XUV 500లో, ఏ2, ఏ3 నిందితులు మారుతి స్విఫ్ట్ వాహనం ద్వారా గంజాయి స్వాధీనం చేసే ప్రయత్నం చేశారు. అయితే హైదరాబాద్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితులపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు వాహనాలను చెక్ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులతో పాటు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు.


డ్రగ్స్ దందా చేస్తున్న యువతి అరెస్టు


హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్‌ఎస్‌డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్‌ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు వారి మీద కేసు పెట్టారు. వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు. ఆమె తరచూ గోవాకు వెళ్తూ ఉండడం.. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చిందని అన్నారు.