టిఫిన్ సెంటర్ ఓనర్ ఒకరు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడడం కలకలం రేపుతోంది. సాఫ్ట్ వేర్ కంపెనీల మధ్యలో ఉన్న బాగా ప్రాచుర్యం కలిగిన టిఫిన్ సెంటర్ యజమాని ఇలా డ్రగ్స్ కేసులో దొరికిపోవడం వారి వినియోగదారులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో డీఎల్ఎఫ్ స్ట్రీట్‌లో వరలక్ష్మీ టిఫిన్స్ అనే హోటల్ ను ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈయన నిన్న (సెప్టెంబరు 11) ఓ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరు. ఈ గ్రూపులో అనురాధ అనే ఓ యువతి కూడా ఉన్నారు.


డీఎల్‌ఎఫ్‌ వీధిలోని ఫుడ్‌ లేన్‌లోని ఈ హోటల్‌ గురించి భోజన ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా హోటల్‌ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. హోటల్‌ ప్రారంభించిన తక్కువ కాలంలోనే.. ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. తాజా డ్రగ్స్ కేసులో వరలక్ష్మి టిఫిన్స్‌ యజమానితో పాటు.. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 14 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు, రూ.97,500 రూపాయల నగదు, ఐదు మొబైల్‌ ఫోన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 


ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ కీలక వివరాలు వెల్లడించారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని అన్నారు. డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు. ఆమె తరచూ గోవాకు వెళ్తూ ఉండడం.. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చిందని అన్నారు. 


ప్రధాన నిందితురాలు డ్రగ్‌ పెడ్లర్‌ అనురాధ డబ్బు సంపాదన కోసం డ్రగ్స్‌ అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె గోవా నుంచి అక్రమంగా నగరానికి డ్రగ్స్‌ రవాణా చేస్తుంది. ఈ క్రమంలో అనురాధకి వరలక్ష్మి టిఫిన్స్‌ ఓనర్‌ ప్రభాకర్‌ రెడ్డి, పల్లెటూరి పుల్లట్లు ఓనర్‌ వెంకట్ తో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా స్థానికంగా డ్రగ్స్‌ అమ్మకాలు ప్రారంభించింది. కొకైన్‌, ఎండీఎంఏ, ఎకాస్టసి పిల్స్‌ను అక్రమంగా అమ్మడం ప్రారంభించారు. వీరంతా మోకిలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలుసుకుని, డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన డీల్‌ చేసుకుంటుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారాడని చెప్పారు. 


గుంటూరు వ్యక్తి కూడా


ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని వెల్లడించారు. శివ కూడా కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారి అనురాధకు సహకరించినట్లు వెల్లడించారు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నామని, వారి మూడు వాహనాలు సీజ్ చేసినట్లుగా చెప్పారు. వారి ఫోన్లు కూడా సీజ్ చేశామని వెల్లడించారు. అందులో వారి కస్టమర్లకు సంబంధించి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు. వీరిని రిమాండ్ చేసి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, వారి నెట్ వర్క్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వివరించారు.