చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి నిమిషంలో బీజేపీలో చేరిక రద్దయింది. పార్టీలో చేరికపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చీకోటి ప్రవీణ్. ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాలన్న ఆయన...ఇదేం పెద్ద సమస్య కాదన్నారు. ఎన్నో ఆటు పోట్లను చూశానని., ఇంతకంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీలో చేరికపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు చీకోటి ప్రవీణ్.
ప్రాంతాలతో సంబంధం లేకుండా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారని అన్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్న చీకోటి ప్రవీణ్...పార్టీ పెద్దలతో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మీ అందరి బలం, ఆశీర్వాదం, అభిమానం నాకుందంటూ ఫ్యాన్స్ తో అన్నారు. రాజకీయాల్లో ఆవేశం పనికి రాదని ఓపికతో ఉండాలన్నారు. రేపు దీక్ష కారణంగా సీనియర్లు అందుబాటులో లేరని బీజేపీ కార్యాలయం సిబ్బంది చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు.
కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు షాక్ తగిలింది. కమలం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న చీకోటి ప్రవీణ్‌కు చుక్కెదురైంది. తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుంచి ర్యాలీగా.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోసం గంటల పాటు వేచి చూశారు. చీకోటి, తన అనుచరులు పడిగాపులు కాశారు. చీకోటి రాకముందే పార్టీ కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి వెళ్లిపోయారు. దీంతో హంగు ఆర్భాటాలతో వచ్చిన చీకోటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈడీ సోదాలతో ఫేమస్ అయిపోయిన చికోటి.. అసలు ఎవరు? అనేది ఆసక్తికరం. అతడి లైఫ్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులతో సెల్ఫీ దిగేవరకు వెళ్ళాడు. ఈవెంట్లకు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లను పిలిచి రెమ్యునరేషన్ ఇచ్చినా, తన చుట్టూ హంగు ఆర్భాటం ఉన్నా క్యాసినోతో పాటు.. చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్ చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారి.. సినిమాలంటే ఆసక్తి ఉండడంతో.. నిర్మాతగా మారి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.. విలన్‌గా నటించినా సంపాదించింది లేదు కానీ.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్ చేయడం, ఆ కేసులో జైలుకు సైతం వెళ్లాడు.
ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తూ వచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.. అన్ని డిపార్ట్‌మెంట్లతో టచ్‌లోకి వెళ్లాడు. రాజకీయ నేతలను సైతం బుట్టలో వేసుకున్నాడు.