Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 01 ఫిబ్రవరి 2025న భారతదేశ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ప్రజల్లో చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఆర్థికవేత్తలు సహా అన్ని రంగాలపై & ఓవరాల్‌గా దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రగతిపై ప్రత్యక్ష ప్రభావం చూపే పద్దు అది. కాబట్టి, నిర్మలమ్మ బడ్జెట్ ప్రతిపాదనల కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగ వర్గాలు, వ్యాపార & వాణిజ్య రంగాల నాయకులు, సంఘాల నుంచి కోర్కెలు, డిమాండ్లు ఇప్పటికే ఆర్థిక మంత్రి టేబుల్‌పైకి చేరాయి. తమ ఆశలకు ఆమోదం లభిస్తుందా, లేదా అన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో కనిపిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పార్లమెంట్‌కు సమర్పించే సాధారణ బడ్జెట్ గురించి మీకు తెలుసు. మరి, బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?. ప్రపంచమంతా బ్లాక్ బడ్జెట్ అని పిలిచే పద్దును మన దేశంలో కూడా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను, 1973-74లో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు సమర్పించారు.
బ్లాక్ బడ్జెట్ ఎందుకు సమర్పించాల్సి వచ్చింది?
ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, 1973-74 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పించింది. ఆ సమయంలో, భారతదేశ ఆర్థిక మంత్రిగా యశ్వంతరావు చవాన్ (Finance Minister Yashwant Rao Chavan) ఉన్నారు. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం (Financial crisis)లో ఉంది. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధం తర్వాత దేశం ఆర్థికంగా బలహీనపడింది. ఇది కాకుండా, 1973లో రుతుపవనాలు కూడా నిరుత్సాహపరిచాయి & దేశవ్యాప్తంగా కరవు (Drought) విలయతాండవం చేసింది. పంటలు పండలేదు, పనులు దొరకలేదు, ప్రజలు ఆకలితో అల్లాడారు. ఈ కారణాల వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితంగా దేశం లోటు బడ్జెట్ (Deficit budget)ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అప్పటి ఆర్థిక మంత్రి స్పందన ఇదీ..
ఈ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారిందని, బ్లాక్ బడ్జెట్ అవసరమని భావించామని వెల్లడించారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే... "ప్రభుత్వ ఖజానా నిండుకుంది, డబ్బు కొరతను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు తగ్గించవలసి వచ్చింది".
బ్లాక్ బడ్జెట్ అని ఎందుకు పిలిచారు?
ఈ బడ్జెట్ లో 550 కోట్ల రూపాయల ద్రవ్య లోటును యశ్వంతరావు చవాన్ చూపించారు. లోటుకు చిహ్నంగా మారింది కాబట్టి దానికి బ్లాక్ బడ్జెట్ అని పేరు పెట్టారు. ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా, వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్‌లో లోటు ఏర్పడడం సహజం. కరవు & ఆహార కొరత కారణంగా దేశం పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఈ కారణంగా బడ్జెట్‌లో లోటు ఏర్పడిందని చవాన్ అప్పట్లో చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: మొబైల్ ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ కంపెనీలు ట్యాక్సీ ఛార్జీలను నిర్ణయిస్తున్నాయా?