CCPA Investigation: ఓలా, ఉబెర్ వంటి ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వినియోదారుడి మొబైల్ ఫోన్ మోడల్‌ను బట్టి ట్యాక్సీ ఛార్జీలను నిర్ణయిస్తున్నాయని, అన్యాయమైన వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నాయని చాలా రోజులుగా దేశవ్యాప్తంగా గగ్గోలు రేగుతోంది. ఒకే టాక్సీ కంపెనీ, ఒకే సమయంలో, ఒకే దూరానికి వివిధ ఫోన్ మోడల్స్‌లో వివిధ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ కొందరు స్క్రీన్ షార్ట్స్ తీసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆధారాలు సమర్పించి ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ల గుట్టు రట్టు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది.
CCPA దర్యాప్తు
ఓలా, ఉబెర్ వంటి ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు నిజంగానే స్మార్ట్ ఫోన్ మోడల్‌ను బట్టి ఛార్జీలను వసూలు చేస్తున్నాయా, లేదా అనే వాస్తవాన్ని త్వరలో వెల్లడిస్తానని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ విషయంలో వాస్తవాలు బయట పెట్టేందుకు విచారణ చేయాలని 'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' (CCPA)ని ఆదేశించినట్లు ప్రహ్లాద్ జోషి గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
ఓలా, ఉబర్ వంటి ఆన్‌లైన్ టాక్సీ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మొబైల్ ఫోన్ మోడల్ ఆధారంగా విభిన్న ధరలను అవలంబిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నెలల క్రితం ఫిర్యాదులు అందాయి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు అధిక ఛార్జీ వసూలు చేస్తున్నారు. అదే సమయంలో, అదే దూరానికి ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటే తక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇలా, ఎక్కువ & తక్కువ ఛార్జీలకు సంబంధించిన మొబైల్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి.
ఉబెర్ ఏం చెప్పిందంటే..?
CCPA దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో, మొబైల్ ఫోన్ మోడల్ బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలను Uber తిరస్కరించింది. తమ వద్ద అలాంటి ప్రైస్ మోడల్ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫోన్ మోడల్ ఆధారిత ధరల గురించిన అపార్థాలను పరిష్కరించడానికి తాము CCPAతో కలిసి పనిచేస్తున్నామని Uber ప్రతినిధి రాయిటర్స్‌తో చెప్పారు. వినియోగదారు ఫోన్ తయారీదారు ఎవరు అనే దాని ఆధారంగా ధరను నిర్ణయించే వ్యవస్థ తమ వద్ద లేదన్నారు.
ఫుడ్ డెలివరీ & ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ పోర్టల్‌లకు సంబంధించి అవలంబిస్తున్న విభిన్న ధరల వ్యూహాలపై వచ్చిన ఫిర్యాదులపై కూడా దర్యాప్తు చేయవలసిందిగా (CCPA)కు సూచించినట్లు కేంద్ర మంత్రి పోస్ట్ చేసారు.
మొబైల్ ఛార్జింగ్‌ను బట్టి రేట్లు?
సెల్ ఫోన్‌లో ఛార్జింగ్ ఆధారంగా కూడా క్యాబ్ కంపెనీలు రేట్లు నిర్ణయిస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. యూజర్ ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బు ఛార్జ్ చేస్తున్నట్లు కొందరు నెటిజన్లు ఆరోపించారు.
అమెరికా, కెనడా తర్వాత భారత్
అమెరికా & కెనడా వెలుపల, ఉబెర్ కంపెనీకి భారతదేశం అతి పెద్ద మార్కెట్. ఇక్కడ ఉబెర్ కంపెనీ ఓలా, రాపిడో కంపెనీల నుంచి తీవ్రమైన వ్యాపార పోటీ ఉంది. ఎలక్ట్రిక్ రైడ్ యాప్ బ్లూ స్మార్ట్ కూడా ఇలాంటి పోటీని ఎదుర్కొంటోంది.
మరో ఆసక్తికర కథనం: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!