SEBI to introduce Rs 250 sachet SIP: విద్యార్థులు, గృహిణులు, రైతులు సహా అన్ని వర్గాల వాళ్లు, ముఖ్యంగా అల్ప ఆదాయ వర్గాల ప్రజలు కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టగలిగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చారిత్రాత్మక సంస్కరణ తీసుకురాబోతోంది. మ్యూచవల్‌ ఫండ్‌ కంపెనీలు ‍‌(AMCs) 250 రూపాయల SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌)ను కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై సూచనలను కోరుతూ, ఒక సంప్రదింపుల పత్రం (Consultation paper) విడుదల చేసింది. ఈ ప్రతిపాదన ద్వారా.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి తక్కువ ఆదాయ వ్యక్తులను కూడా ఆకర్షించాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంప్రదింపు పత్రంపై వాటాదారులు తమ సలహాలు, సూచనలను 06 ఫిబ్రవరి 2025 లోగా అందించాలి.


సాచెటైజ్డ్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్‌
250 రూపాయల SIPను 'సాచెటైజ్డ్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్‌'గా సెబీ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా ప్రజలను ప్రోత్సహించడం, పొదుపు అలవాటును పెంచడం, మ్యూచువల్ ఫండ్ రంగంలో కొత్త పెట్టుబడిదారుల కోసం చిన్న మొత్తాల పొదుపులు & పెట్టుబడులకు మార్గం సులభతరం చేయడం వంటి కార్యక్రమాలను సంప్రదింపుల పత్రంలో సెబీ చేర్చింది. సెబీ ప్రతిపాదన ప్రకారం, ఒక పెట్టుబడిదారుడు రాయితీ ధరతో మూడు స్మాల్‌ టికెట్ SIPలు చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. 3 అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో (AMCs) ఒక్కో దానిలో గరిష్టంగా ఒక SIPకు మాత్రమే అనుమతి లభిస్తుంది. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు 3 స్మాల్‌ టికెట్ SIPల కంటే ఎక్కువ SIPలను అందించవచ్చు. అయితే, రాయితీ రేట్లు మొదటి మూడు SIPలకు మాత్రమే పరిమితం అవుతాయి. అంతేకాదు, గ్రోత్ ఆప్షన్ కింద మాత్రమే చిన్న టికెట్ SIPలు అందుబాటులో ఉంటాయి.


చిన్న టికెట్ SIP కోసం చేసే చెల్లింపు & పెట్టుబడి విధానం NACH & యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆటో పే మోడ్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. చిన్న టికెట్ SIPని 'స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్ మోడ్' లేదా 'డీమ్యాట్ మోడ్‌'లో పెట్టుబడి పెట్టవచ్చు. 


వాస్తవానికి, ప్రస్తుతం రూ.100 SIPలు కూడా ఉన్నాయి. అయితే, అవి చాలా స్వల్ప పథకాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అన్ని ఆప్షన్లు అందుబాటులో లేవు. అందువల్ల ఇవి ప్రజాదరణ పొందలేకపోయాయి. మెజారిటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో కనీస SIP ధర ఇప్పుడు రూ.500గా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 


మరో ఆసక్తికర కథనం: కాక రేపుతున్న గోల్డ్‌ రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే