Investment Tips For In Fixed Deposits: భారతీయులకు అత్యంత ప్రియమైన పెట్టుబడి వ్యూహాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FDs) ఒకటి, ఇది సంప్రదాయ మదుపు మార్గం. మన తాతల కాలం నుంచి FDలు పాపులర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మోడ్‌గా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలకు అవసరమైన చాలా అనకూలతలు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నాయి. అందుకే వాటికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ.


ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక, వీటిలో డబ్బు జమ చేస్తే (బ్యాంక్‌ దివాలా తీస్తే తప్ప) నష్టపోవడం జరగదు. హామీతో కూడిన రాబడిని కచ్చితంగా అందిస్తాయి. అంటే, వడ్డీ రేటు ముందే నిర్ణయమవుతుంది కాబట్టి, ఆ మేరకు వడ్డీ ఆదాయం చేతికి వస్తుంది. 


ఇప్పుడు.. వివిధ బ్యాంకులు, పోస్టాఫీసులు వివిధ కాలావధుల కోసం FD పథకాలను అమలు చేస్తున్నాయి. కాలావధిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రజలు, తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఒక స్కీమ్‌ను ఎంచుకుని పెట్టుబడి పెట్టవచ్చు.



స్టేట్‌ బ్యాంక్‌ Vs పోస్ట్ ఆఫీస్ 
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ SBI విభిన్న FDలను అందిస్తోంది. పోస్టాఫీస్‌ కూడా టైమ్‌ డిపాజిట్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండూ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పెట్టుబడిదార్లను ఊరిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ - దేనిలో FD చేయాలన్న విషయంపై మీరు డైలమాలో ఉంటే, ఈ రెండింటిని పోల్చి చూస్తే సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.


SBI, తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లపై పెట్టుబడిదార్లకు 6.90 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. 


5 సంవత్సరాల FDపై రాబడి


ఒక వ్యక్తి, రూ.3.50 లక్షలతో 5 సంవత్సరాల FD వేయాలనుకుంటే, ఆ కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 6.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. అదే కాలానికి పోస్ట్ ఆఫీస్ 7.50 శాతం వడ్డీ రాబడి ఇస్తుంది.


SBIలో 5 సంవత్సరాల FDపై రాబడి:         


మొత్తం పెట్టుబడి: రూ. 3,50,000 ‍‌(అనుకుందాం)
వడ్డీ రేటు: సంవత్సరానికి 6.50 శాతం
అంచనా వేసిన రాబడి: రూ. 1,33,147
మెచ్యూరిటీ తర్వాత చేతికి వచ్చే మొత్తం డబ్బు: రూ. 4,83,147 (అసలు రూ.3,50,000 + వడ్డీ రూ.1,33,147)


పోస్టాఫీస్‌లో 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై రాబడి:          


మొత్తం పెట్టుబడి: రూ. 3,50,000
వడ్డీ రేటు: సంవత్సరానికి 7.50 శాతం
అంచనా వేసిన రాబడి: రూ. 1,57,482
మెచ్యూరిటీ తర్వాత చేతికి వచ్చే మొత్తం డబ్బు: రూ. 5,07,482 ‍‌(అసలు రూ.3,50,000 + వడ్డీ రూ.1,57,482)


మీ ఐదేళ్ల FD మెచ్యూరిటీ సమయంలో, స్టేట్‌ బ్యాంక్‌ కంటే పోస్టాఫీస్‌లో మీకు రూ. 24,335 (1,57,482 - 1,33,147) వడ్డీ డబ్బు అదనంగా లభిస్తుంది.


స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఫలానా చోట పెట్టుబడి పెట్టాలని 'abp దేశం' ఎప్పుడూ సలహాలు ఇవ్వదు. 


మరో ఆసక్తికర కథనం: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి