Universal Account Number: ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF) కోసం కట్‌ చేస్తారు, ఆ మొత్తం ఆ ఉద్యోగి PF ఖాతాలో జమ అవుతుంది. పదవీ విరమణ తర్వాత, ఈ డబ్బులో కొంత భాగం ఏకమొత్తంగా (Lump sum) & మరికొంత భాగం నెలనెలా పింఛను ‍‌(Monthly pension) రూపంలో అందుతుంది. 


ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా మూల వేతనంలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు. కంపెనీ యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇద్దరి నుంచి వచ్చిన డబ్బు EPF & EPS ఖాతాలకు దామాషా ప్రకారం వెళుతుంది. EPF ఖాతాలో జమ అయ్యే ఫండ్‌ మీద కేంద్ర ప్రభుత్వం వార్షిక వడ్డీ చెల్లిస్తుంది. EPFకి కంట్రిబ్యూట్ చేసే ఉద్యోగికి 12 అంకెల 'యూనివర్సల్ అకౌంట్ నంబర్' (UAN) లభిస్తుంది. ఈ నంబర్‌ ఉద్యోగికి చాలా కీలకం. దీని సహాయంతో PF ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. పీఎఫ్‌కు సంబంధించి ఏ పని జరగాలన్నా UAN ఉండాలి. అయితే, కొందరు ఉద్యోగుల విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఐడీకి ఒరొకరి యూఏఎన్‌ లింక్‌ కావడం వాటిలో ఒకటి. ఇలా జరిగినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి.


సర్క్యులర్‌ జారీ చేసిన EPFO 
వేరొకరి లేదా తప్పుడు IDతో మీ UAN లింక్ అయితే, ఇప్పుడు మీరు మీ ఇంట్లో కూర్చునే దానిని డీలింక్‌ (Delink) చేయవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), 17 జనవరి 2025న జారీ చేసిన సర్క్యులర్‌లో, UANలో తప్పుగా అనుసంధానమైన మెంబర్ ఐడీని డీ-లింక్ చేసే సదుపాయాన్ని సభ్యులకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపింది. UANకి లింక్ జరిగిన మరొక సభ్యుని IDని తొలగించడానికి, ఆధార్‌తో అనుసంధానమైన మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. డీలింక్ చేసే ప్రాసెస్‌కు ముందు, మీకు సంబంధించిన ప్రతి వివరాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం ముఖ్యం, తద్వారా ఎటువంటి పొరపాటు జరగదు. 


మీ UANకి లింక్ అయిన మరొకరి IDని తొలగించే ప్రక్రియ:


* ముందుగా, https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‌లోకి వెళ్లండి.
* మీ UAN, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి.
* 'వ్యూ మెనూ' మీద క్లిక్‌ చేయండి.
* ఇప్పుడు మీ సర్వీస్ రికార్డ్‌ను చూడటానికి, సబ్-మెనులోకి వెళ్లి, 'సెలెక్ట్ సర్వీస్ హిస్టరీ'పై క్లిక్ చేయండి.
* ఇక్కడ మీ UANతో అనుసంధానమైన తప్పుడు ID మీకు కనిపిస్తుంది.
* ఇప్పుడు, సంబంధిత రికార్డ్ దగ్గర ఉన్న 'డీలింక్' బటన్ పై క్లిక్ చేయండి.
* కన్ఫర్మేషన్ అలర్ట్ వచ్చినప్పుడు, 'ఓకే' పై క్లిక్ చేసి కంటిన్యూ చేయండి.
* తదుపరి పేజీలోకి వెళ్లి, డీలింక్ చేయడానికి కారణాన్ని ఎంచుకోండి. 
* ఇప్పుడు మీ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది.
* OTPని సంబంధిత గడిలో నమోదు చేసి, 'సబ్మిట్‌'పై క్లిక్ చేయండి.
* OTP ధృవీకరణ తర్వాత ID డీలింక్ అవుతుంది. డీలింక్ జరిగిన ID మీ సర్వీస్‌ హిస్టరీలో కనిపించదు.


తప్పుడు మెంబర్‌ ఐడీని డీలింక్‌ చేసే ప్రాసెస్‌లో మీకు ఏదైనా డౌట్‌ ఉంటే, EPF నుంచి సాయం కోసం అభ్యర్థించవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఆస్తి తనఖా పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలీకపోతే నష్టపోతారు!