How to choose a right loan: ప్రజలు, వ్యాపారులకు ఏదోక సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. వ్యాపారులకు, తమ వ్యాపారాన్ని విస్తరించడం, పరికరాలను కొనుగోలు చేయడం లేదా పని మూలధన అవసరాల కోసం డబ్బు కావాలి. అటువంటి ఆర్థిక అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉండే మార్గం ఆస్తిపై రుణం (LAP) తీసుకోవడం. ఈ లోన్ తీసుకోవడానికి నివాస ఆస్తి లేదా వాణిజ్య ఆస్తిని తనఖా (Mortgage) పెట్టొచ్చు. ఇది సురక్షిత రుణం (Secured loan) కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు లోన్ లభిస్తుంది.
వ్యాపారం లేదా గృహ సంబంధిత అవసరాల కోసం డబ్బు కూడగట్టేందుకు మీ ఆస్తి విలువను ఉపయోగించుకుని రుణం తీసుకోవచ్చు. మీకు లభించే రుణం మొత్తం.. మీరు తనఖా పెట్టే ఆస్తి విలువ (Property value)తో పాటు మీ వయస్సు, క్రెడిట్ స్కోర్ (Credit score), ఆదాయం (Income) వంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఆస్తిపై రుణం తీసుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు:
ఆస్తిపై రుణంపై వడ్డీ రేటువడ్డీ రేటును అన్నింటికంటే ముఖ్యంగా చూడాలి. రుణ వ్యయాన్ని ఇది గణనీయంగా ప్రభావితం చేస్తుంది. లోన్ ఇచ్చే బ్యాంక్, మీ క్రెడిట్ ప్రొఫైల్, ఆదాయం వంటి అంశాల ఆధారంగా ఇది మారవచ్చు. వడ్డీ రేటులో స్వల్ప తగ్గుదల కూడా తిరిగి చెల్లించే మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, తక్కువ వడ్డీ రేటును పొందడానికి వివిధ లోన్ ఆప్షన్లను పోల్చడం మంచిది. వడ్డీ రేటు మీ EMIలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి, EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
మంజూరు సమయం, సౌలభ్యంమీ ఆర్థిక అవసరాలను తక్షణం తీర్చడానికి, మీకు సకాలంలో లోన్ మంజూరు కావాలి. లోన్ ప్రాసెస్ త్వరగా పూర్తి చేసే రుణదాతను ఎంచుకోవడం కూడా ఇక్కడ ముఖ్యమే. LAP డబ్బును వ్యాపార విస్తరణ, ఇంటి పునరుద్ధరణ లేదా ఇతర ఖర్చులకు ఉపయోగించవచ్చు.
తిరిగి చెల్లింపు వ్యవధిఆస్తిపై రుణం పొందే ముందు, రీపేమెంట్ వ్యవధిని అంచనా వేయడం ఒక ముఖ్యమైన అంశం. ఇది, మీ EMI & వడ్డీ మొత్తంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. రీపేమెంట్ గడువు ఎక్కువ కాలం ఉంటే మీ నెలవారీ వాయిదా తగ్గుతుంది. అయితే, అదే సమయంలో చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది. మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తిరిగి చెల్లింపు వ్యవధిని నిర్ణయించుకోవాలి.
ఆస్తిపై రుణం పొందడానికి అర్హత ప్రమాణాలుమీరు కొన్ని అర్హతల పరిధిలో ఉంటే, లోన్ కోసం పెట్టుకున్న మీ అప్లికేషన్‌ను రుణదాత ఆమోదించే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా, బ్యాంక్‌లు చూసే అర్హతలు ఇవి:
వయస్సు: దరఖాస్తుదారు వయస్సు 25 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి
ఆదాయం & ఉద్యోగ స్థిరత్వం: కొన్ని సంవత్సరాల వరకు స్థిరమైన ఆదాయం, వ్యాపార కొనసాగింపు అవసరం
ఆస్తి విలువ: మీ ఆస్తి నిరంతరం అభివృద్ధి చెందే ప్రాంతంలో ఉంటే మదింపు సమయంలో మంచి విలువ లభిస్తుంది. చట్టపరమైన అనుమతులు కూడా అక్కడ అవసరం.
క్రెడిట్ స్కోర్: మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. సాధారణంగా 750 కంటే ఎక్కువ సిబిల్ (CIBIL) స్కోరు ఉంటే మంచిది.
ఆస్తిపై సరైన రుణాన్ని ఎలా ఎంచుకోవాలి?
మీ వ్యాపార అవసరాలు & వాటికి అవసరమైన మొత్తాన్ని అంచనా వేయండి.
మీరు పొందగల బెస్ట్ ఆఫర్‌ను గుర్తించడానికి ఆస్తి విలువ, బ్యాంక్ ఫీజులు, తిరిగి చెల్లించే రూల్స్‌ను పోల్చుకోండి.
ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, జరిమానా ఛార్జీలు వంటి అదనపు ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోండి.
భవిష్యత్తులో మీకు అదనపు నిధులు అవసరమో, కాదో తెలుసుకోండి. సౌకర్యవంతమైన టాప్-అప్ లోన్ అందించే రుణదాతను ఎంచుకోండి.
మరో ఆసక్తికర కథనం: బిట్‌కాయిన్‌లో బ్లడ్ బాత్ - 1,02,000 స్థాయికి పతనం, ఏంటి కారణం?