Union Budget 2025 Expectations: చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 కేంద్ర బడ్జెట్ కంటే ముందు, 'గ్రాంట్ థోర్న్టన్ భారత్' సంస్థ ప్రి-బడ్జెట్ సర్వేను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) బడ్జెట్‌పై వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకున్న కీలక అంచనాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
సర్వేలోని ముఖ్యాంశాలు:
1. తక్కువ పన్ను రేట్లు & అధిక మినహాయింపులు: ఆదాయ పన్ను రేట్లు (Tax Rates) తగ్గించాలని 57% మంది, మినహాయింపుల (Exemptions) పరిమితి మరింత పెంచాలని 25% మంది కోరుకున్నారు. అదనంగా, 11% మంది ప్రామాణిక తగ్గింపు పరిమితి (Standard Deduction Limit)ని పెంచాలని సూచించారు. ఇది, జీతం తీసుకునే వ్యక్తులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
2. ఆదాయ పరిమితి: చిన్న ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు, ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న వారిపై భారాన్ని తగ్గించడానికి (ITR Filing) కోసం ఆదాయ పరిమితి పెంపును 56% మంది కోరుకున్నారు.
3. NRI టాక్స్ పేయర్స్: 38% మంది NRIలు విదేశీ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటును అడిగారు.
4. NRIల ఇ-వెరిఫికేషన్: ఐటీఆర్ ఫైలింగ్ వెరిఫికేషన్ కోసం OTPలు ఉపయోగించడానికి 35% మంది అనుకూలంగా ఉన్నారు.
5. కొత్త పన్ను విధానం వైపు మొగ్గు: 72% పన్ను చెల్లింపుదార్లు కొత్త ఆదాయ పన్ను (New Tax Regime) విధానాన్ని ఎంచుకున్నారు. దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అదనపు సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. అయితే, పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) దశలవారీగా తొలగించవచ్చని ప్రభుత్వం హింట్ ఇచ్చినప్పటికీ, 63% మంది ఇప్పటికీ పాత పన్ను వ్యవస్థ కింద డిడక్షన్ లిమిట్స్ పెంచాలని కోరుకుంటున్నారు.
6. జాతీయ పెన్షన్ పథకం (NPS) సంస్కరణలు: 53% మంది, మరింత సరళమైన విత్‌డ్రా రూల్స్ ఉండాలని & ముందస్తు ఉపసంహరణలు లేదా యాన్యుటీ చెల్లింపులపై పన్ను మినహాయింపులు (tax exemptions) పెంచాలని డిమాండ్ చేశారు.
7. ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ప్రోత్సాహకాలు: దేశంలోఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) స్వీకరణను ప్రోత్సహించడానికి పన్ను ప్రోత్సాహకాలను తిరిగి ప్రవేశపెట్టాలని పన్ను చెల్లింపుదార్లు కోరుతున్నారు. EV కొనేందుకు బ్యాంక్ లోన్ తీసుకుంటే, ఆ రుణంపై వడ్డీకి పన్ను మినహాయింపులు ఇవ్వాలని 66% మంది డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, గతంలో, EV రుణాలకు పన్ను మినహాయింపులను ప్రవేశపెట్టింది, కానీ పన్ను చెల్లింపుదార్లు ఈ ప్రోత్సాహకాలను తిరిగి ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది.
8. ఆధారపడిన దివ్యాంగులు ఉన్నవారికి మద్దతు: పన్ను చెల్లింపుదారుపై ఆధారపడే దివ్యాంగులు ఉన్నప్పుడు, వారిపై పెరుగుతున్న ఆర్థిక భారం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ కేటగిరీలోకి వచ్చేవారిపై పన్నుల భారం తగ్గించాల్సిన అవసరాన్ని సర్వే సూచించింది. 46% మంది దీనిని కోరుకున్నారు. గుర్తించిన వైకల్యాల పరిధిని విస్తరించాలని 18% మంది అడిగారు.
9. ఆస్తి పన్ను ఉపశమనం: కొత్త పన్ను విధానంలో గృహ ఆస్తి నష్టాల సెటిల్‌మెంట్‌ను 53% మంది సమర్థించగా, పాత విధానంలో రూ.2 లక్షల పరిమితిని తొలగించడం లేదా పెంచడాన్ని 47% మంది సమర్థించారు.
మరో ఆసక్తికర కథనం: కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!