Union Budget 2025 Expectations: భారతదేశంలో ఆదాయ పన్ను చట్టాన్ని మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 63 ఏళ్ల వృద్ధ ఆదాయ పన్ను చట్టం స్థానంలో ప్రభుత్వం నవ యవ్వన బిల్లును ప్రవేశపెట్టబోతోంది. నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman)‌ ఈ కొత్త ప్రత్యక్ష పన్ను చట్టాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చు. ఈ కొత్త చట్టం, ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళంగా మార్చడమే కాకుండా, మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా తీసుకురానుంది. ఈ మార్పులు సామాన్య పౌరులు, వ్యాపారవేత్తలు, వ్యాపారాలపై ప్రభావం చూపొచ్చు.


కొత్త చట్టం వల్ల సామాన్యుడి విషయంలో ఏం మారొచ్చు?
రిపోర్ట్స్‌ ప్రకారం, కొత్త ఆదాయ పన్ను చట్టం ఇప్పటికే ఉన్న సంక్లిష్టతలను తొలగించడంపై దృష్టి పెడుతుంది. ప్రస్తుత ఆదాయ పన్ను చట్టంలో సాధారణ ప్రజలకు అర్థం కాని కష్టమైన నిబంధనలు అనేకం ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం, ఈ సంక్లిష్టతలు తగ్గుతాయి & సాధారణ పౌరులు సులభంగా అర్థం చేసుకునేలా భాష సరళంగా ఉంటుంది. దీనివల్ల, చట్ట ప్రకారం తాము ఏం చేయాలో ప్రజలకు అర్ధం అవుతుంది.


కొత్త చట్టంలో పన్ను స్లాబ్‌లను కూడా సవరించవచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 15 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులపై పన్ను తగ్గింపు అవకాశం ఉంది. దీనివల్ల మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక ఉపశమనం లభించడంతో పాటు వారి ఖర్చు చేయగల శక్తి పెరుగుతుంది.


డిడక్షన్స్‌లో మార్పులు


కొత్త చట్టంలో పన్ను మినహాయింపుల విభాగం కూడా మారవచ్చు. ప్రస్తుతం, సెక్షన్ 80C, 80D వంటి అనేక రకాల డిడక్షన్స్‌ ఉన్నాయి. కొత్త చట్టంలో కొన్ని తగ్గింపులను తొలగించవచ్చు లేదా సవరించవచ్చు. ఫైనల్‌గా, పన్ను చెల్లింపుదారుల టాక్స్‌ ప్లానింగ్‌ సులభంగా ఉండేలా ఈ మార్పులు ఉండొచ్చు.


డిజిటల్ ఇండియాపై ఫోకస్‌


డిజిటల్ ఇండియాను దృష్టిలో ఉంచుకుని, కొత్త ఆదాయ పన్ను చట్టం డిజిటల్ టాక్సేషన్‌పై ఫోకస్‌ పెంచే ఆస్కారం ఉంది. పన్ను చెల్లింపుదారుల కోసం ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ మరింత సులభంగా మారుతుంది. పన్ను చెల్లింపుదారులు తమ పత్రాలు, సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా అప్‌లోడ్ చేసేలా మార్పులు జరగొచ్చు.


వ్యాపారులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?


వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారుల కోసం ప్రత్యేక నిబంధనలు ఉండవచ్చు. నమోదు ప్రక్రియను సులభంగా మారిస్తే చిన్న వ్యాపారులపై భారం తగ్గుతుంది, సమ్మతి పెరుగుతుంది. తద్వారా, చిన్న వ్యాపారస్తులు తమ పనిపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఇది కాకుండా, కొత్త చట్టం ప్రకారం పన్ను వివాదాలు తగ్గించడంతో పాటు వివాదాలను పరిష్కరించడానికి మెరుగైన వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చు. ఈ వ్యవస్థ వివాదాలను త్వరగా పరిష్కరించడంలో సాయపడుతుంది, తద్వారా పన్ను చెల్లింపుదారులు సుదీర్ఘ న్యాయ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండదు. 


అంతేకాదు, కొత్త ఆదాయ పన్ను చట్టం సామాజిక భద్రత పథకాలకు మద్దతు ఇవ్వడంపైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది. పేద & బలహీన వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే పథకాలకు ప్రత్యేక కేటాయింపులు ఉండవచ్చు.


మరో ఆసక్తికర కథనం: పన్ను బాధ్యత తగ్గించే బెస్ట్‌ ఆప్షన్స్‌ ELSS, NPS - ఏమిటి వీటి గొప్ప?