Budget 2023:
ప్రత్యక్ష పన్నుల రాబడి పెరగాలంటే సుంకాలు, సర్‌ఛార్జీల మోత ఉండొద్దని థింక్ ఛేంజ్ ఫోరమ్ (TCF) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ మంది పన్నులు చెల్లించేందుకు మెరుగైన సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పన్నుల హేతుబద్ధీకరణ చేపట్టాలని సూచించింది.
ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలంటే ప్రభుత్వానికి పన్నులు రాబడి పెరగాలని టీసీఎఫ్ అభిప్రాయపడింది. ఎక్కువ ఆదాయం వస్తే అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుబడులు లభిస్తాయని వెల్లడించింది. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడమే కారణంగా తెలిపింది. మితిమీరిన పన్ను, సంక్లిష్టమైన పన్ను విధానాలు, లిటిగేషన్ల పెరుగుదల లక్ష్య సాధనకు అడ్డంకిగా మారాయంది.
ప్రతి ఒక్కరూ ఐటీఆర్ సమర్పించేలా సాంకేతిక మద్దతు అవసరమని టీసీఎఫ్ తెలిపింది. అప్పుడే పన్నుల పరిధి పెరుగుతుందని వెల్లడించింది. టైర్-2 నగరాలు, పట్టణాల్లో పన్ను వసూళ్ల పెరుగుదలకు అవసరమైన వ్యూహాలు రచించాలని సూచించింది.
'అవినీతి, అక్రమ వ్యాపారాలను తనిఖీ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. కానీ పన్ను ఎగవేత దారులు ఒక అడుగు ముందే ఉంటున్నారు. వినూత్నమైన పద్ధతుల్లో దేశంలోకి వస్తువులు, సరకులను స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మరింత మెరుగైన సాంకేతికను వినియోగించాలి. విమాన, నౌకాశ్రయాల్లో ఎక్కువ స్కానర్లు అమర్చాలి. కృత్రిమ మేధస్సును ఉపయోగించాలి' అని సీబీఐసీకి చెందిన పీసీ ఝా అన్నారు.
ఎక్కువ లాభదాయకత ఉండే బంగారం, పొగాకు, మద్యంపై ఎక్కువ పన్నులు విధించడం వల్ల పన్ను ఎగవేత, స్మగ్లింగ్ జరుగుతోందని ఝా పేర్కొన్నారు. ఎక్కువ నియంత్రణ ఉండే పొగాకు, మద్యం వంటి రంగాల్లో ఏటా కేంద్రం రూ.28,500 కోట్లకు పైగా పన్ను నష్టపోతోందన్నారు. సాంకేతికత పెంచితే అక్రమార్కులు భయపడతారని ఆయన చెప్పారు.
దేశంలో చాలామంది వ్యక్తులు పన్ను చెల్లించపోయినా శిక్షల్లేకుండా బయటపడుతున్నారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు అన్నారు. 'భారత్‌లో కొద్ది మందే పన్నులు చెల్లిస్తారు. మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మన జీడీపీలో పన్నుల నిష్ఫత్తి తక్కువే. పన్నుల పరిధి పెంచేందుకు ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించాలి. పన్నుల వ్యవస్థలో అంచనాలతో పాటు ఐటీఆర్ దాఖలు వంటివి ఎంతో ముఖ్యం' అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ₹8 లక్షలు సంపాదించినా పేదలే అయితే, ₹2.50 లక్షల ఆదాయం మీద పన్ను ఎందుకు? లాజిక్ మిస్సైందా?
Also Read: షాక్ - జనవరి 1 నుంచి రూ.2000 నోట్లు రద్దు రూ.1000 పునరుద్ధరణ! ఫ్యాక్ట్‌చెక్!