Indian Currency Notes:


'కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి రూ.2000 నోట్లను రద్దు చేస్తోంది. బదులుగా మళ్లీ రూ.1000 నోట్లను తీసుకొస్తోంది. చాలా మంది  రూ.2000 నోట్లను భద్రపరుచుకున్నారు. అవినీతి డబ్బును వెలికి తీసేందుకే మోదీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది'


- సోషల్‌ మీడియాలో బ్రౌజ్‌ చేస్తుంటే ఈ మధ్య ఇలాంటి సందేశాలు, చిత్రాలు ఏమైనా కనిపించాయా! నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందేమోనని కంగారు పడ్డారా! మళ్లీ నోట్ల రద్దు జరిగితే ఏం చేయాలని ఆందోళనకు గురయ్యారా? అయితే అస్సలు టెన్షన్‌ పడకండి. సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ఈ సమాచారం నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తెలిపింది.


కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను రద్దు చేయడం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొంది. మళ్లీ రూ.1000 నోట్లను చలామణీలోకి తీసుకొస్తుందన్న సమాచారం తప్పుదోవ పట్టించేదని వెల్లడించింది. ప్రజలు అలాంటి సందేశాలు చూసి మోసపోవద్దని సూచించింది.






అవినీతి, నల్లధనం సమస్యను అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసింది. రూ.500, రూ.1000 నోట్లు వెంటనే రద్దవుతాయని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం దేశంలో కొన్ని మార్పులు తీసుకురాగా కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చింది. నకిలీ నోట్ల బెడద తగ్గగా డిజిటల్‌ ఎకానమీ పెరిగింది. అయితే సకాలంలో డబ్బు దొరక్క ప్రజలు ఇబ్బంది పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ తర్వాత రూ.500, రూ.2000  కొత్త నోట్లు రావడంతో సమస్య సద్దుమణిగింది.


పీఐబీ ఎప్పటికప్పుడు ప్రజలను నకిలీ సమాచారంపై అలర్ట్‌ చేస్తోంది. అనుమానిత వైరల్‌ మెసేజులపై నిఘా పెడుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటే వెంటనే సోషల్‌ మీడియాలో ఫ్యాక్ట్‌చెక్‌ చేసి వివరాలను పోస్ట్‌ చేస్తోంది. ఏదైనా అనుమానిత సందేశం కనిపిస్తే ఫ్యాక్ట్‌చెక్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. https://factcheck.pib.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావొచ్చు. +918799711259కు వాట్సాప్‌ చేయొచ్చు. pibfactcheck@gmail.comకు మెయిల్‌ పంపొచ్చు. ఇప్పటికే నిర్ధారణ చేసిన సందేశాలు https://pib.gov.in నిత్యం అప్‌డేట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ ట్విటర్లో పోస్ట్‌ చేస్తున్నారు.


Also Read: జనవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవు! పూర్తి లిస్ట్‌ ఇదే!


Also Read: ₹8 లక్షలు సంపాదించినా పేదలే అయితే, ₹2.50 లక్షల ఆదాయం మీద పన్ను ఎందుకు? లాజిక్‌ మిస్సైందా?