Budget Incometax :   కొత్త ఏడాది వస్తోంది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరిలోనే కొత్త బడ్దెట్ కూడా కేంద్రం ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ అంటే ఎక్కువ మంది ఎదురు చూసే ఒకే ఒక్క అంశం ఆదాయపు పన్ను పరిమితి పెంచుతారా లేదా అనేదే. కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క సారి కూడా పన్ను పరిమితి పెంచలేదు. రెండున్నర లక్షల ఆదాయం  దాటిన ప్రతీ ఒక్కరూ పన్ను చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా రెండో ఆప్షన్ ప్రవేశ పెట్టి.. ఐదు లక్షల సంపాదన వరకూ పన్ను లేకుండా చూసే విధానం తీసుకు వచ్చారు. కానీ దీని వల్ల ఎవరికీ లాభం లేకపోవడంతో పాత విధానంలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడుతున్నా.. ముందుగా ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతారని ప్రచారం జరుగుతుంది. కానీ చివరికి నిరాశే మిలుగుతుంది. ఈ సారి కూడా.. రూ. ఐదు లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు అంటూ ప్రచారం ప్రారంభమయింది. 


ఎన్నికల బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెడుతుందని నమ్ముతున్నారు.  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను  విధానంలో పన్ను రహిత స్లాబ్‌ను రూ.5 లక్షలకు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సారి ఎక్కువగా ఆశలు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఆర్థిక వ్యవస్థ. ట్యాక్స్‌ భారం కొనసాగుతోందని, ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డిస్పోజబుల్‌ ఇన్‌కం పెంచడానికి, డిమాండ్ సైకిల్‌ పునరుద్ధరించడానికి పర్సనల్‌ ఇన్‌కం ట్యాక్స్‌ రేట్లను తగ్గించవచ్చని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.  


ఆదాయపు పన్ను పరిమితి  పెంచడం వలన మదింపుదారులకు పన్ను చెల్లింపు తగ్గుతుందని,ఆ సొమ్మును పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చంటున్నారు.  ప్రత్యామ్నాయ పన్ను విధానంలో ప్రస్తుతం ఏడాదికి రూ.5 లక్షల వరకు ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పన్ను చెల్లింపుదారులు రూ.2.5- రూ.5 లక్షల శ్లాబ్‌లో వచ్చే పన్నుకు డిడక్షన్‌ పొందుతారు. రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్న వారు పాత ట్యాక్స్‌ విధానంలో, కొత్త ట్యాక్స్ విధానంలో ఎలాంటి పన్ను చెల్లించరు . కానీ ప్రస్తుతం ఈ రు. ఐదు లక్షల పరిమితి విధానాన్ని అతి తక్కువ మందే వినియోగించుకుంటున్నారు. 


2020-21 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టారు. తక్కువ పన్ను రేటుతో ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు. కొత్త పన్ను విధానాన్ని ఆప్షన్‌గా చూడాలని తెలిపారు. అయితే పాత విధానంతో పోలిస్తే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో కేవలం 10-12 శాతం పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు.  పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటే   మార్పు మొత్తం రెవెన్యూపై ఎంతవరకు ప్రభావం కనిపిస్తుంది, ప్రభుత్వానికి ఆ పని చేసే అవకాశం ఉందో లేదో చూస్తారు.   కొత్త పన్ను విధానంలో ట్యాక్స్‌ నెట్‌ను పెంచడంపై రెవెన్యూ ఎంత ప్రభావితమవుతుందో, ప్రాథమికంగా అంచనా వేసి..తదుపరి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి.. నెలకు రూ. యాభై వేలు సంపాదించే ఉద్యోగి కూడా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. మరి కేంద్రం ఈ వేతన జీవుల్ని దయతలుస్తుందో లేదో !