ఏపీలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రేట్లు పెంచడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తతో అధికారులు పని చేసి,మద్యం పూర్తిగా నిషేదించే దిశగా చర్యలు ఉండాలన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆదాయాన్ని సమకూర్చే శాఖల పై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులు ప్రత్యేకంగా ఆలోచనలు చేయాలన్నారు.వాణిజ్య పన్నులశాఖ అధికారులతో సీఎం సమీక్ష..వాణిజ్య పన్నులశాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. అవగాహన పెంచడం, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ శాఖ పై సీఎం సమీక్ష...శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో... సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని జగన్ అదికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలని, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో... ఏయే రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. మైనింగ్ పై సైతం సీఎం జగన్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నాన్ ఆపరేషనల్ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలని, నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని అదికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీని పై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, సీఎం జగన్ కు ప్రత్యేకంగా నివేదికను సమర్పించారు.