Kerala Governor Row: కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య జరుగుతోన్న వ్యవహారంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రభుత్వం ఓ యూనివర్సిటీకి వీసీని నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ ఆదేశాలను పక్కనపెట్టింది.
ఇలా ఆదేశాలు
ఫిషరీస్, ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి ఇటీవల వీసీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రెగ్యులేషన్స్ 2018ని ఉల్లంఘించేదిగా ఆ నియామకం ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వీసీని నియమించాలని ఛాన్స్‌లర్ ఆఫ్ వర్సిటీస్ అయిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఆదేశించింది.
కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్, ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఈ మధ్యే డాక్టర్ రిజీని నియమించింది కేరళ ప్రభుత్వం. అయితే ఆ నియామకం చెల్లుబాటు కాదని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇదీ వివాదం
కేరళలో 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని ఇటీవల గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశించారు. దీంతో గవర్నర్, కేరళ సర్కార్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను తొలగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయంలో ఇటీవల మంత్రి బాలగోపాల్ చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితంగా ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. దీంతో ఆర్థిక మంత్రి బాలగోపాల్‌ను కేబినెట్ నుంచి తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు.
దీంతో ముఖ్యమంత్రి- గవర్నర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు (Chief Minister Vijayan) గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) ఇటీవల ఓ సవాల్ విసిరారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని సీఎం విజయన్ రుజువు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ అన్నారు.
కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపైనా గవర్నర్ విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని గవర్నర్ అన్నారు.
Also Read: Jawaharlal Nehru Jayanti: 'పథేర్ పంచాలి' వెనుక ఇంత కథ ఉందా? నెహ్రూకు ఆ సినిమా అంటే!