Budget 2023:
ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్బీఐ రెపోరేట్లు పెంచింది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యే 225 బేసిస్ పాయింట్లు వడ్డించింది. పెరిగిన వడ్డీ భారాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెంటనే కస్టమర్లకు బదిలీ చేశాయి. ఫలితంగా నెలసరి వాయిదాల (EMI) భారంతో ప్రజలు అల్లాడుతున్నారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇంటి కొనుగోలు దారులకు పన్నులు తగ్గించాలని, కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అవేంటంటే!
వడ్డీ మినహాయింపు రూ.5 లక్షలకు పెంపు
ప్రస్తుతం గృహరుణంపై చెల్లించిన వడ్డీపై సెక్షన్ 24(b) ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తోంది. దీని ప్రకారం సొంతింటిపై ఒక ఏడాదికి రూ.2 లక్షల వరకే గరిష్ఠ ప్రయోజనం లభిస్తోంది. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ఇళ్ల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరుతున్నారు. 6-7 శాతం ద్రవ్యోల్బణం ఉన్న దేశంలో రూ.2 లక్షల పన్ను మినహాయింపు సరిపోదని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే ఎకానమీ మరింత పుంజుకుంటుందని చెబుతున్నారు.
80సీ పరిధి రూ.4 లక్షలకు పెంపు
గృహరుణం వడ్డీపైనే కాకుండా అసలు పైనా ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. సెక్షన్ 80సీ ప్రకారం ఏడాదికి రూ.1.5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే పీపీఎఫ్, సుకన్య, ఈఎల్‌ఎస్‌ఎస్, జీవిత బీమా ప్రీమియం వంటి పథకాలన్నీ సెక్షన్ 80సీ బ్రాకెట్‌లోనే ఉన్నాయి. ఫలితంగా ఇంటి కొనుగోలుదారులకు గరిష్ఠ ప్రయోజనం దక్కడం లేదు. అందుకే 80సీ బ్రాకెట్ పరిధిని కనీసం రూ.4 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా ఈ సెక్షన్ నుంచి గృహరుణం అసలును తొలగించి ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
అందుబాట ధరల శ్రేణిలో మార్పు
అందుబాటు ధరలో ఇళ్ల పథకం ధరల శ్రేణిని సవరించాలని స్థిరాస్తి వ్యాపారులు కోరుతున్నారు. ఇప్పుడున్న రూ.45 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబయి వంటి నగరాల్లో రూ.45 లక్షలు ఏం సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ ఈ ధరకు ఇళ్లు కొనడం కష్టమంటున్నారు. అందుకే ఈ పరిమితిని కనీసం రూ.60-65 లక్షలకైనా పెంచాలని సూచిస్తున్నారు.
మూలధనం పెట్టుబడిపై ఉపశమనం
ఆదాయపన్ను చట్టం సెక్షన్ 54 ప్రకారం ఇంటిని అమ్మడం ద్వారా పొందిన దీర్ఘకాల మూలధన రాబడిని కొత్త ఇళ్లు నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఈ డబ్బు వాడుకుంటే పాత ఇంటిని అమ్మిన మూడేళ్లలోపు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణాలకు మూడేళ్ల కన్నా ఎక్కువ సమయం పడుతుందని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. ఈ డెడ్‌లైన్‌ను మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలని కోరుతున్నారు. అంతేకాకుండా మూలధన రాబడిని రెండు ప్రాపర్టీలపై రూ.2 కోట్ల వరకే పెట్టుబడి పెట్టాలన్న నిబంధన తొలగించాలని అంటున్నారు.
Also Read: రెడ్ అలర్ట్! ఈ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కట్!
Also Read: సింగిల్ ప్రీమియంతో జీవితాంతం నెలకు రూ.20 వేలు ఇచ్చే పాలసీ ఇది