LIC Jeevan Akshay Policy: భారత దేశ ప్రజల కోసం, ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ‍‌(LIC) అనేక రకాల పాలసీలు తీసుకువచ్చింది. ఇంకా, మార్కెట్‌ అవసరాలకు తగ్గట్లుగా కొత్త ప్లాన్స్‌ను కూడా కూడా ఎప్పటికప్పుడు ప్రారంభిస్తోంది. దీర్ఘకాలిక పొదుపుగా, పెట్టుబడులుగా, ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాగా, ఆదాయ పన్ను ఆదాగా... ఇలా రకరకాల రూపాల్లో, దేశంలోని ప్రతి వర్గానికీ ఎల్‌ఐసీ పథకాలు ఉపయోగ పడుతుంటాయి.


ఇదే కోవలో, ఎల్‌ఐసీ ప్రకటించిన పథకం పేరు ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ పాలసీ (LIC Jeevan Akshay Policy). ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలు పొందవచ్చు. ఈ పాలసీలో ఒక్కసారి, అంటే ఏక మొత్తంగా పెట్టుబడి పెట్టాలి. నిర్ణీత కాలం తర్వాత, మీరు ప్రతి నెలా 20 వేల రూపాయల మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. 


జీవన్‌ అక్షయ్‌ పాలసీ గురించి పూర్తి సమాచారం:


రిస్క్ లేని, ఎటువంటి టెన్షన్ లేని పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న వాళ్లకు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పథకం ఒక మంచి ఆప్షన్‌. 
ఈ పాలసీని కొనుగోలు చేయాలంటే, మీ వయస్సు 30 నుంచి 85 సంవత్సరాల మధ్య ఉండాలి. 
దీనిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో (ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా) ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 
మరొకరితో కలిసి జాయింట్‌గానూ జీవన్ అక్షయ్ పాలసీ తీసుకోవచ్చు.
సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ కాబట్టి, కనీస పెట్టుబడి ఒక లక్ష రూపాయలు. 
జాయింట్‌గా పాలసీ తీసుకుంటే, ప్రతి ఒక్కరు కనీసం రూ.లక్ష పెట్టుబడి పెట్టాలి. 
ఇందులో కనీస పింఛను రూ. 12 వేలు అందుతుంది.
నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా వార్షిక పద్ధతిలో పెన్షన్‌ అందుకోవచ్చు.
పెట్టుబడి పెట్టిన నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా పెన్షన్‌ రూపంలో డబ్బు తిరిగి పొందుతారు. మీ పెట్టుబడి ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది.
జీవన్‌ అక్షయ్‌ పాలసీ కింద 10కి పైగా యాన్యుటీ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. పాలసీ ప్రారంభంలోనే, గ్యారెంటీ యాన్యుటీ రేట్‌ ఎంతో పాలసీదారుకు తెలుస్తుంది. 
పాలసీదారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి నెలవారీ రాబడి కొద్దిగా మారుతుంది.
పాలసీదారుకి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఉంది. 
ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ ఆగిపోతుంది, నామినీకి పెట్టుబడి తిరిగి వస్తుంది.
ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 


నెలకు రూ.20 వేల పెన్షన్‌ కోసం ప్రీమియం ఎంత?
ఒక పెట్టుబడిదారు ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ పాలసీలో సింగిల్‌ ప్రీమియంగా రూ. 9,16,200 జమ చేస్తే..  నెలకు రూ. 6,859 చేతికి వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి రూ. 86,265... ఆరు నెలలకు రూ. 42,008... మూడు నెలలకు రూ. 20,745 పొందుతారు. నెలనెలా 20 వేల రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే, పాలసీదారు ఏక మొత్తంగా 40 లక్షల 72 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి.