ABP Explain:
దేశం డిజిటల్ ఎకానమీ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. రోజూ కోట్ల సంఖ్యలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. మొబైల్ రీఛార్జుల నుంచి సినిమా, రైలు, విమాన టికెట్ల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. సౌకర్యవంతంగా ఉండటంతో కస్టమర్లు ఈ సేవలకు అలవాటు పడిపోయారు. తమ కన్వీనియెన్స్‌ను అడ్డుపెట్టుకొని కంపెనీలు భారీ స్థాయిలో కన్వీనియన్స్ ఫీజు గుంజుతున్నాయని వారు వాపోతున్నారు.
ఏంటీ బాదుడు!
ఆన్‌లైన్ సేవల కంపెనీలు మొదట్లో అన్నీ ఉచితంగానే ఇచ్చాయి. యూజర్ పెనెట్రేషన్ పెరగ్గానే కొద్ది మొత్తంలో రుసుములు వసూలు చేయడం ఆరంభించాయి. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్లు అడుగుతున్నాయి. రెండేళ్లుగా తమ సేవలకు కన్వీనియెన్స్ ఫీజును తీసుకుంటున్నాయి. కొద్ది మొత్తంలో చెల్లించేందుకు రెడీగా ఉన్నా కనీవినీ ఎరగని రీతిలో డిమాండ్ చేస్తుండటంతో కస్టమర్లు చిరాకు పడుతున్నారు. ఉదాహరణకు మొబైల్ రీఛార్జులపై పేటీఎం రూ.1-6 వరకు వసూలు చేస్తోందని ఫిన్‌షాట్స్ రిపోర్ట్ చేసింది. సినిమా టికెట్లపై బుక్‌మై షో ఏకంగా రూ.15-30 వరకు తీసుకుంటోంది. విమాన టికెట్లపై విస్టారా రూ.300-600 వరకు కన్వీనియెన్స్ ఫీజు దండుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఇందుకేమీ మినహాయింపు కాదు. నిజం చెప్పాలంటే 2020-21లో కన్వీనియెన్స్ ఫీజు ద్వారానే రూ.299 కోట్లు ఆర్జించింది.
నియంత్రణ అవసరం!
టెక్నాలజీ ఖర్చుల కోసం కన్వీనియెన్స్ ఫీజు తీసుకోవాల్సి వస్తోందని కంపెనీ మాట! మెరుగైన సేవలు అందించేందుకు ఇది తప్పదని పేర్కొంటున్నాయి. వీటిపై నియంత్రణ లేకుంటే స్థాయికి మించి వసూలు చేస్తాయని కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నగదు రహిత వ్యవస్థ నుంచి దారిమళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం ఎక్కువ కన్వీనియెన్స్ ఫీజు చెల్లించాల్సి వస్తోందని ప్రతి నలుగురులో ముగ్గురు వినియోగదారులు అంటున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలపై కంపెనీలు ఎక్కువ కన్వీనియెన్స్ ఫీజు డిమాండ్ చేస్తున్నాయని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 77 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇష్టం లేకుండానే!
తమకు ఇష్టం లేకున్నా కన్వీనియెన్స్ ఫీజు చెల్లించక తప్పడం లేదని 75 శాతం మంది తెలిపారు. ఏటా ఈ భారం అధికమవుతోందని చెప్పారు. తాము ఎలాంటి ఫీజు తీసుకోబోమని 2019లో పేటీఎం చెప్పినప్పటికీ కొన్ని రోజులుగా రూ.100 రీఛార్జులపై కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేస్తోంది. ఫోన్‌పే గత అక్టోబర్ నుంచే తీసుకుంటోంది. అధిక కన్వీనియెన్స్ ఫీజుల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నగదు రహిత సమాజం పరివర్తన కష్టమవుతుందని సర్వే వెల్లడించింది. విమానాలు, రైల్లు రద్దైనప్పుడు కన్వీనియెన్స్ ఫీజు తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి!