Birth Certificate Mandatory:
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక అడుగు వేయబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటు హక్కు, స్కూల్ అడ్మిషన్ సహా అన్నింట్లోనూ జనన ధ్రువీకరణ పత్రాన్ని (బర్త్ సర్టిఫికెట్) తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు జనన, మరణ ధ్రువీకరణ చట్టం-1969ని (RBD ACT) సవరించేందుకు ముసాయిదా రూపొందించింది. మనుషుల జోక్యం లేకుండా దేశ వ్యాప్తంగా రియల్ టైమ్‌లో ఈ సమాచారం అప్‌డేట్ అవ్వనుంది. 18 ఏళ్లు నిండగానే ఆటోమేటిక్‌గా ఓటు హక్కు కల్పించడం, మరణిస్తే తొలగించడం వంటివి చేస్తుంది.
సవరణ బిల్లు ప్రకారం ఇకపై ఎవరైనా మరణిస్తే ఆసుపత్రి యాజమాన్యం, ఆరోగ్య సంస్థలు మరణానికి కారణాలు వివరిస్తూ ఒక పత్రాన్ని స్థానిక రిజిస్ట్రార్, మరో పత్రాన్ని సంబంధీకులకు ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఆర్బీడీ చట్టం ప్రకారం జనన, మరణాల నమోదు ఉల్లంఘన శిక్షార్హమైన నేరం. ఈ చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు పాఠశాలల్లో అడ్మిషన్, వివాహ నమోదు వంటి కనీస సేవలకూ బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయబోతున్నారు.
2022, డిసెంబర్ 7న జనన, మరణాల సవరణ బిల్లు పార్లమెంటు శీతకాల సమావేశాల్లో టేబుల్ మీదకు వస్తుంది. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం గతేడాది ఈ ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొచ్చింది. న్యాయ శాఖ పరిశీలించిన తర్వాత బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. ఆన్‌లైన్‌లో డేటా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండటంతో ఓటర్ల జాబితా, ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సు డేటాబేసుల్లో డూప్లికేషన్ తగ్గుతుంది.
సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) రిపోర్టు ప్రకారం దేశంలో జనన, మరణాల ధ్రువీకరణ నమోదు పెరిగింది. 2010లో జననాల నమోదు 82 శాతం ఉండగా 2019లో అది 92.7 శాతానికి చేరుకుంది. 2010లో మరణాల నమోదు 66.9 శాతం ఉండగా 2019లో 92 శాతానికి పెరిగింది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు సీఆర్‌ఎస్‌ను నిర్వహిస్తున్నాయి. సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే జాతీయ జనాభా నమోదు (NPR) అప్‌డేషన్‌కు ఈ డేటానే ఉపయోగించుకుంటుంది. ఎన్‌పీఆర్‌లో ఇప్పటికే 119 కోట్ల మంది సమాచారం ఉంది. జాతీయ పౌర నమోదు (National Register of Citizens - NRC)కి ఇది తొలి మెట్టు అవుతుంది.
Also Read: ఓపీఎస్, ఎన్‌పీఎస్‌లో ఏది బెస్ట్! రెండింట్లో తేడాలేంటి - ఎక్కువ డబ్బు ఎందులో పొందొచ్చు!
Also Read: బయ్ నౌ పే లేటర్‌కు పోటీగా మరో ఆఫర్! అప్పుతో పన్లేకుండానే ఆన్‌లైన్ షాపింగ్!