New Pension Vs Old Pension:
కొన్నాళ్లుగా ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ (OPS), న్యూ పెన్షన్ సిస్టమ్ (NPS) వ్యవస్థలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు పాత పింఛన్ పద్ధతి వైపు మళ్లాయి. రాజకీయ దుమారం పక్కన పెడితే అసలీ రెండు విధానాల మధ్య తేడా ఏంటి? ఎప్పట్నుంచి ఇది మారింది? ప్రయోజనాలు ఏంటి?
2004 నుంచి ఎన్‌పీఎస్
ఓపీఎస్ పింఛను ఆధారిత వ్యవస్థ. 2003లో ఎన్‌డీఏ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఉద్యోగులకు సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చింది. 2004, ఏప్రిల్ 1 నుంచి పింఛను, పెట్టుబడి ఆధారిత పథకం ఆరంభించింది. ఇందులో కొంత డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. రిటైర్ అయ్యాక ఎక్కువ మొత్తం అందించే లక్ష్యంతోనే ఇలా చేశారు. ఉద్యోగి నష్టభయాన్ని అనుసరించే పెట్టుబడి విధానాలు ఉంటాయి.
OPS ప్రయోజనాలు
- పాత పింఛను వ్యవస్థలో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ప్రతి నెలా నిర్దేశించిన మొత్తం పింఛను రూపంలో వస్తుంది.
- చివరి సారి తీసుకున్న జీతంలో సగం పింఛనుగా పొందుతారు.
- ఉద్యోగులకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు.
- ఓపీఎస్‌లో ఎలాంటి పన్ను అమలు చేయరు.
- ఈ వ్యవస్థలో చేరేందుకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
NPS ప్రయోజనాలు
- కొత్త పింఛను వ్యవస్థనూ ప్రభుత్వ ఉద్యోగుల కోసమే తీసుకొచ్చారు. అయితే ప్రైవేటు ఉద్యోగులూ ఇందులో చేరొచ్చు.
- ఉద్యోగం చేస్తున్నంత వరకు నెలవారీ జీతం నుంచే ఎన్‌పీఎస్‌లో కంట్రిబ్యూట్ చేస్తారు. ఆ మొత్తాన్ని మార్కెట్ అనుబంధ సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు.
- ఆదాయ పన్నులో సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయించుకోవచ్చు. సెక్షన్ 80CCD (1B) కింద రూ.50,000 వరకు అదనపు పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది.
- ఉద్యోగి రిటైర్ అయ్యాక మొత్తం ఫండ్ నుంచి కొంతమేర విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం మెచ్యూరిటీ తర్వాత 60 శాతం కార్పస్‌పై పన్ను ఉండదు. మిగిలిన 40 శాతంపై పన్ను విధిస్తారు. అయితే మిగిలిన 40 శాతం డబ్బుతో ఆన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాలి. దాన్నుంచి ప్రతి నెలా పింఛను ఇస్తారు.
- 2004 నుంచి సైనిక దళాలను మినహాయించి కేంద్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ దీనినే వర్తింపజేస్తున్నారు.
- ఎన్‌పీఎస్‌లో వేతనంలో 10 శాతం వరకు నెలవారీ కంట్రిబ్యూషన్ చేయాలి. ప్రభుత్వమూ సమానంగా కంట్రిబ్యూట్ చేస్తుంది. 2019 నుంచి కంట్రిబ్యూషన్ రేట్‌ను 14 శాతానికి పెంచారు.
- 18-65 ఏళ్ల మధ్య వయస్కులు ఎన్‌పీఎస్ పథకంలో చేరేందుకు అర్హులు.