SNPL vs BNPL, Online Shopping:
మనలో అందరికీ మొబైల్ బ్రౌజింగ్ చేయడం అలవాటే! అలా చేస్తున్నప్పుడు మార్కెట్ ఔట్‌లెట్లు, యాప్‌ల నుంచి కొన్ని ఆఫర్లు వస్తుంటాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేస్తున్నప్పుడు 'ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాతే చెల్లించండి' వంటివి కస్టమర్లను ఊరిస్తుంటాయి. కొన్నాళ్లు ఈ 'బయ్ నౌ పే లేటర్' (BNPL) క్రేజ్ బాగానే నడిచింది. ఇప్పుడు దీనికి పోటీగా వచ్చిన 'ఇప్పుడు ఆదా చేయండి తర్వాత కొనండి' (SNBL) ఆఫర్ సంచలనం సృష్టిస్తోంది.
SNBL ఏంటి?
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆన్‌లైన్, ఈ-కామర్స్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. వాటితో పాటే డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల హవా నడిచింది. కస్టమర్లు ఈఎంఐ నుంచి బయ్ నౌ పే లేటర్ విధానానికి మారారు. తాజాగా సేవ్ నౌ బయ్ లేటర్ పద్ధతీ వచ్చింది. మార్కెట్లో కొద్దిమందికి దీనిపై అవగాహనా ఉంది. భవిష్యత్తులో కొనుగోలు చేయబోయే వస్తువు లేదా అవసరయ్యే ఖర్చుకు ఇప్పట్నుంచే డబ్బును ఆదా చేసుకోవడమే SNBL. చాలా స్టార్టప్‌లు సరికొత్త ఆఫర్లతో మార్కెట్లోకి వచ్చాయి. పైగా 10-20 శాతం వరకు రాయితీ అందిస్తున్నాయి.
ముందున్న స్టార్టప్పులు
టార్టాయిస్, హబుల్, మల్టిపుల్ వంటి స్టార్టప్పులు ఎస్‌ఎన్‌బీఎల్ ఆఫర్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వారికి వస్తున్న స్పందన సైతం బాగానే ఉంది. ఒకే వేదికలో డబ్బులు ఆదా చేసుకొని అక్కడే వస్తువును కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు! ఈ ఆఫర్లను వినియోగదారుల వద్దకు సరికొత్తగా తీసుకొని వెళ్లేందుకు కొన్ని స్టార్టప్పులు డేటా, టెక్నాలజీని వాడుకుంటున్నాయి.
SNBL బెనిఫిట్స్ ఏంటి?
గురుగ్రామ్ కేంద్రంగా 2022, ఏప్రిల్‌లో హబుల్ ఆరంభమైంది. ప్రస్తుతం నైకా, మింత్రా, క్రోమా, బ్లూస్టోన్ వంటి బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో 20 బ్రాండ్లతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనుందని మీడియా ద్వారా తెలిసింది. ఎస్‌ఎన్‌బీఎల్ రంగంలో దిల్లీకి చెందిన టార్టాయిస్‌కు సైతం మంచి క్రేజ్ ఉంది. వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ వేదికల్లో డబ్బు ఆదా చేసుకుంటున్న కస్టమర్లకు కనీసం 10 శాతం రాయితీ ఇస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ విధానం
ఈ వేదికల్లో చేరేందుకు మొదట కస్టమర్లు పేర్లు, వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మర్చంట్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు యాపిల్, మేక్ మై ట్రిప్, క్రోమా, మింత్రా, నైకా వంటివి ఎంపిక చేసుకోవచ్చు. ఈ మర్చంట్ల ద్వారా కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు. ఆపై లక్ష్యంగా పెట్టుకున్న డబ్బు, కాల పరిమితిని ఎంపిక చేసుకోవాలి. నెలకు రూ.500 నుంచి ఆదా చేసుకోవచ్చు. ఎస్‌ఎన్‌బీఎస్ స్కీముల్లో ప్రోత్సాహకాలూ ఉన్నాయి. 2022, ఏప్రిల్ నుంచి టార్టాయిస్ యాప్‌లో 1.5 లక్షల మంది కస్టమర్లు చేరడం గమనార్హం. నాలుగు లక్షలకు పైగా హబుల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
మ్యూచువల్ ఫండ్లలోనూ!
ఎస్‌ఎన్‌బీఎల్ విభాగంలో కొన్ని కంపెనీలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన మల్టిపుల్ నిర్దేశిత మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇస్తోంది. ఫండ్ ద్వారా ఎక్కువ రాబడి వస్తే కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం ట్రావెల్, గ్యాడ్జెట్లు, అప్లయన్సెస్ కేటగిరీ మర్చంట్లతో మల్టిపుల్ ఒప్పందం కుదుర్చుకుంది.